చిట్లిపోయిన ముఖాన్ని
అతికిస్తున్నాను!
చివరికి ముఖాన్ని గుర్తించక పోతానా!!?
చూపుల్లోని ఆఖరి వెలుగుల్ని
విశ్లేషిస్తున్నాను
కళ్ళను కనిపెట్టలేక పోతానా!!?
మూగబోయిన స్వరాన్ని
సరి చేస్తున్నాను
అందులోని సరిగమలను
తిరిగి స్వరపరచలేనా!!?
ముఖగవాక్షానికి ద్వారం పెదవులు
వాటి తలుపులు తెరుస్తున్నాను
చివరికి
చిరునవ్వులేమిటో తేల్చలేనా!!?
నుదుట తిలకం పాలిపోయిన
పచ్చబొట్టు పొడిపించి
నిన్నటి తిలకాన్ని గుర్తించలేనా!!?
మాటల తీపిదనాన్ని గుర్తించిన
చెవుల్ని చేదించి
శబ్దం శిథిలాల్లో చిక్కుకున్న
ఒక్క మంచి మాట నైనా పసిగట్టలేనా!!?
తలపై ఎగిరేసిన జెండాలు ఆ జడలు
కలంకం కాదు అలంకారం అది
విధి ఇచ్చిన నెమలిపించాలని
పురివిప్పి చూపలేనా!!?
అందమైన ముఖచిత్రం ఇంద్రధనస్సులా విరిచింది.
ఆడ మగ అడక్కుండానే అర్థమయ్యేలా
అర్ధనారీశ్వరునిలా రూపుదిద్దుకుందీ.!!?
మేఘాల ధూపాలు
సూర్యచంద్రుల దీపాలు
అమృతం నైవేద్యాల మధ్య
దేహాలయంలో దేదీప్యమానంగా
దర్శనమిస్తున్న ముఖం అది.!!!
ఎవరికీ అంతుచిక్కని సమాధానం అది.!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి