సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -325
సింహ ఘంటా న్యాయము
******
సింహము అనగానే అడవికి రారాజైన మృగరాజు,మృగపతి, కేసరి, సారంగం,సింగము అనే పదాలు గుర్తుకు వస్తాయి. ఘంటా అనగా గంట.
 సింహ ఘంటా  అంటే సింహము మెడలో గంట కట్టేవారు. కట్టినా విప్పేవారు ఉంటారా? అని అర్థం.
 తెలుగులో దీనికి  సమానమైన సామెత"పిల్లి మెడలో గంట కట్టేదెవరు ?" 
పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనే కథను మన పెద్దవాళ్ళు పిల్లలకు చెబుతూ ఉంటారు. మనం కూడా కాసేపు చిన్నపిల్లలమై పోయి ఆ కథేమిటో చదువుకుందాం.
అనగనగా ఓ పిల్లి  ఎలుకలు కనబడగానే టపా టపా చంపేయడం మొదలు పెట్టింది. అది చూసి ఎలుకలకు  తమ వంశం అంతరించిపోతుందేమోననే దిగులు పట్టుకుంది. వెంటనే ఎలుకల నాయకుడిని కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశాయి.ఆ సమావేశంలో ఎలుకలన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే "పిల్లి మెడలో గంట కట్టాలి.అలా కడితే అది దాడికి వచ్చేటప్పుడు మెడలో గంట మోగుతుంది.ఆ శబ్దం విని పిల్లికి కనబడకుండా దాక్కోవచ్చు." అనుకున్నాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఏ ఎలుకను అడిగినా సమాధానం లేదు. అంటే గంట కట్టడం అనేది అసాధ్యం. అలా వాటి బాధ బాధలాగే వుండిపోయిందన్న మాట.
అదండీ కథ!అలా అసాధ్యమైన పని గురించి, చేయడానికి వీలు పడని పని గురించి చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.
మరి అడవికి రాజైన సింహం మెడలో గంట కట్టడం అడవి జంతువులకే కాదు మానవ మాత్రులకు కూడా సాధ్యం కాని పని.
(ఐతే గియితే వాటిని మచ్చిక చేసుకొని ఆడించే రింగ్ మాస్టర్ కు సాధ్యపడుతుండొచ్చు)
ఇవి ఎవరికి తెలియదు  దాని కోసం ఇవన్నీ చెప్పుకోవాలా? అనే ఆలోచన మనలో తప్పకుండా వస్తుంది.
కానీ ఈ  న్యాయము లేదా సామెతను సృష్టించిన పెద్ద వాళ్ళు సామాన్యులు కాదండీ!మరి ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థాన్ని చూద్దామా...
ఇది ముఖ్యంగా  దీనిని పాలకులకు ,పాలితులకు వర్తింప చేశారు.పాలకులు అంటే ఎన్నుకోబడిన అధినాయకులు. పాలితులు అంటే వారి పాలనలో జీవించే ప్రజలు.
 ప్రజల చేత ఎన్నుకోబడిన అధినాయకులు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి ఇష్టానుసారం పాలన చేస్తున్నా ఎన్నుకున్న పాపానికి ఐదేళ్ళ పాటు వారిని భరించాల్సిందే.వారి ఆగడాలను అరికట్టడం సాధ్యం కాని పని అనే విస్తృతమైన అర్థంతో మన పెద్దలు ఈ "సింహ ఘంటా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
కానీ మనకూ ఈ రోజు వస్తుందని అంటూ వుంటారు కదా! మరిప్పుడు  అధి నాయకులను ఎన్నుకునే ఎన్నికల సమయం  వచ్చేసింది."పిల్లి మెడలో ఏం ఖర్మ సింహం మెడలో గంట కట్టే అవకాశం  మనకిప్పుడు వచ్చింది.
కాబట్టి ఎవరెలాంటి వారో విజ్ఞత, వివేకం, విచక్షణతో‌ గమనించి ఓటు అనే గంటను కట్టి ఐదేళ్ల సురక్షిత పాలనకు పట్టం కడదాం.అభివృద్ధి పథంలో నడుద్దాం.
 ఇదండీ "సింహ ఘంటా న్యాయము." సింహం లాంటి నాయకుల మెడలో గంట కట్టే,విప్పే న్యాయానికి న్యాయం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు