మంచి మాట!!; -సుగుణ.అళ్లాణి.
మంచిముత్యం లాంటి మాట,
మల్లెలాంటి స్వచ్ఛమైన మాట!
మనుసు పొరలలో దాగిన నిజమైన మాట,
మర్మమేమీ లేని నిర్మలమైన మాట!

వెక్కిరింత లేని నుదురు చెప్పుమాట,
తిరస్కారం లేని కనులు చెప్పుమాట,
మూతిముడుపు లేని ముద్దుమాట,
కరుకుదనము లేని కమ్మనిమాట!

అనునయాన్నిచ్చు ఆదరపుమాట,
గుండెదిటువునిచ్చు గట్టిమాట,
పట్టుదలనిచ్చు పదిలమైన మాట,
హాయిని కలిగించు హాస్యపుమాట!

శూలము వలె గుచ్చు సూదంటు మాట,
అగ్గి రగిలించు అవహేళనపు మాట!
మనుసు ఛిద్రం చేయు ఛీత్కారపు మాట,
బతుకు భగ్నము చేయు బల్లెమంటిమాట!

దగ్గర తనాన్ని దూరంచేయు దురుసు మాట ,
దూరాల్ని దగ్గర చేయు స్నేహపూర్వకపు మాట!
మాట తూలిన మరల రాదని పెద్దల మాట,
నొప్పించక తా నొవ్వని మాటే మంచిమాట!!
                          ***
                           
కామెంట్‌లు