సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -311
సత్ర న్యాయము
*****
సత్రము అనగా యజ్ఞము లేదా యాగము.
ఈ యజ్ఞాలు, యాగాలు అనేక రకాలు. కొన్ని ఒక్కరోజులోనూ, మరికొన్ని కొద్ది రోజులలో పూర్తి చేసేవి . మరికొన్ని చాలా రోజుల పాటు చేసేవి వుంటాయి.
ఆయా యాగాదులను బట్టి వాటిని  నిర్వహించడానికి కొంత మంది ఋత్విక్కులను నియమిస్తారు.అది కూడా ఇంతమంది అని ఓ లెక్క వుంటుంది.ఆ ప్రకారం నియామకం జరుగుతుంది.అలా ఒక్క సారి నియమించబడిన ఋత్విక్కులు అంటే యాగము చేయించే వారు యాగం  ప్రారంభించినది  మొదలు యాగం పూర్తి అయ్యేంత వరకూ  యాగాన్ని వదిలి వెళ్ళకూడదు.
అలా నియమించిన వారిలో ఏదైనా కారణం చేత యజ్ఞవాటికను విడిచి వెళ్ళినట్లయితే వెంటనే అతని స్థానంలో మరొకరిని నియమించాలనీ, ఒక వేళ నియమించకుండా ఉన్నవారితో సరిపుచ్చుకున్నట్లయితే ఆ యాగము భ్రష్టమై పోతుందని అంటుంటారు.ఇలా యాగము భ్రష్టమై పోకుండా , నిర్విఘ్నంగా కొనసాగేలా ,వెళ్ళిన వ్యక్తి స్థానంలో మరొకరిని వెంటనే నియమించాలనీ, అలా నియమించి ఆటంకం లేకుండా పూర్తి చేయాలి .అలా చేస్తేనే ఆ యజ్ఞ ఫలం లభిస్తుందని యాగాదులను నిర్వహించే వారిని ఉద్దేశించి చెప్పినదే ఈ "సత్ర న్యాయము".
 ఈ యజ్ఞాలేంటీ? యాగాలేమిటీ ? ఇదంతా నేటి కాలానికి అవసరమా? అని మీరు నన్ను ప్రశ్నిస్తారని తెలుసు.కాని నేడు కూడా విజయం కోసమో,వానల కోసమో యాగాలు చేయడం చూస్తూనే ఉన్నాం.
 ఒకసారి రేఖా మాత్రంగా ఈ యాగాల గురించి తడుముకుందాం.
యజ్ఞం లేదా యాగం అనేది  ఒక విశిష్టమైన హిందూ సాంప్రదాయం. భారత దేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాల సందర్భాల్లో వివిధ యజ్ఞయాగాదులు చేసేవారని చదువుకున్నాం.
అందులో ముఖ్యంగా మూడు రకాల యాగాలు చేసేవారు.అవి1. పాక యజ్ఞాలు 2.హవిర్యాగాలు3. సోమ సంస్థలు.
అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం, సర్పయాగం, విశ్వజిత్ యాగం , అహోరాత్ర యాగం,పంచమహా యజ్ఞాలు  మొదలైన వాటి గురించి రామాయణ, మహా భారతంలో కొంత వరకు  చదువుకున్నాం కదా!.
అయితే అసలైన యాగం అంటే ఏమిటో దానికి సంబంధించి  వేమన రాసిన పద్యాన్ని చూద్దామా...
"ఎరిగిన శివపూజ యెన్నడు చెడిపోదు/మొదల పట్టుపట్టి వదలరాదు/ మొదలు విడిచి గోడ తుదిబెట్ట గల్గును/ విశ్వధాభిరామ వినురవేమ"
అనగా విధానం తెలుసుకుని చేసే శివపూజ కానీ మరేదైనా మంచి కార్యం కానీ ఎప్పటికీ నిష్ఫలం కాదు. ఏ పని అయినా పట్టుబట్టి ( పట్టువదలకుండా) సాధించేంతవరకూ వదిలిపెట్ట కూడదు.అదెలా అంటే గోడ కట్టాలంటే అడుగు పునాది దగ్గర నుండి కట్టుకుంటూ రావాలి.అంతేగానీ పైనుండి కట్టుకుంటూ ప్రారంభిస్తే నిలుస్తుందా? నిలువదు కదా!. కాబట్టి ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఓ పద్ధతి ప్రకారం చేయాలని ఇందులోని అంతరార్థం.ఇదే యాగానికి వర్తిస్తుంది.మనం చేసే మంచి పనులకూ వర్తిస్తుంది.
ఏదైనా పెద్దదో చిన్నదో ఆశయాన్ని లేదా  కార్యాన్ని మదిలో పెట్టుకుని ఆచరణకు పూనుకుంటాం.అనుకున్నంత సులభం కాదు కదా! ఆచరణ అనేది.దానికి ఎన్నో రకాల ఆటంకాలు ఎదురౌతాయి. ఆర్థిక పరమైనవి,ఆరోగ్య పరమైనవి కూడా. మన దృఢ చిత్తాన్ని ఆటంకపరిచే రకరకాల మాటలు,చేతలు  చేసే పనిని నీరుగార్చే లాంటివి  ఎన్నో వినిపిస్తూ,కనిపిస్తూ వుంటాయి.
వాటిని ఎదుర్కొనే శక్తి ,మానసిక స్థిరత్వం ఎప్పుడైతే కోల్పోతామో యజ్ఞంలా తలపెట్టిన కార్యం లేదా ఆశయం నెరవేరలేదు.ఆ ఫలితాన్ని అందుకోలేము.
కాబట్టి ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండి మనం తలపెట్టిన మంచి పనులు వదలకుండా పూర్తి చేయాలి‌. అలా చేస్తేనే ఫలితాలను పొందగలం .తద్వారా ఆనందాన్నీ చవి చూడగలం. నాతో ఏకీభవిస్తారు కదూ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు