సుప్రభాత కవిత ; - బృంద
బిందువుగా భువికి చేరి
సింధువులో కలిసే తీరులో
ఎన్ని కనుమల మెలికలో
ఎన్ని ఎత్తు పల్లములో!

కొండరాళ్ళ సందున చేరి
కొంటెగ చేయు సవ్వడులను
కోరి వినే మనసుకు
కొత్త స్వరాలు తోచుకాదా??

ఏరు పారు దారులన్నీ
వేరు వేరు పాయలైనా
జారి నేల చేరినాక
కూరిమితో కలిసిపోవా!

కడలి చేరు సంబరాన
కలకలసాగే ఒరవడిలో
జలపాతాల సరిగమలు
సితారగానాల గలగలలు

నింగిని సాగే నీలి మబ్బుల
అంతరంగ సందేశమేదో
పదిలంగ మోసుకుంటూ
బిరబిర సాగే పరుగులు

తొలివెలుగుల జిలుగులన్ని
తమలోనే దాచుకుని
తరంగాల కదలికలో
తళతళలు ఒలికిస్తూ

తరలిపోవు జలధారకు
తళుకులీను సొగసులద్ది
తేటనీటి అద్దాన తేరిపార
తన బింబము చూసుకోవాలని

బిరబిరాన గగనాన
బంతిలా  కదిలి
బంగరు రంగుల కాంతులతో
ఎదిగివచ్చు వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు