సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -309
సక్తు న్యాయము
******
సక్తు అంటే పేలాల పిండి.
"అన్నము తినడం మానేసి పేలాల పిండి తిన్నట్లు"అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఆకలి తీరాలంటే అన్నమే తినాలి.దాహం తీరాలంటే  నీళ్ళే తాగాలి. అంతే గానీ ఆకలి తీరడానికి పేలాల పిండి తింటే ఆకలి తీరుతుందా? దాహం వేస్తుందని కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇట్టే చెబుతారు.అన్నమే ఆకలి తీరుస్తుందనీ, నీళ్ళే దప్పిక తగ్గిస్తాయని.
ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎప్పుడు చేయకూడదో తెలిసి కూడా  కొందరు తప్పులు చేస్తుంటారు.అందు వలన  మంచి ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా వస్తుంటాయి.అవేంటో చూద్దాం.
ఆహార శాస్త్రం ప్రకారం అన్నం తినే వారు అన్నమే తినాలి.అన్నం తినడం వల్ల శక్తి, పని చేయడానికి బలం వస్తుంది.మానసిక సమత్వం మరియు ఆరోగ్యం  పెంచడంలో  ప్రముఖపాత్ర వహిస్తుంది.
 అలాగే అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞాన మయ,ఆనందమయ అనెడి పంచకోశంతో కూడిన శరీరంలో అన్నమయ కోశానికే మొదటి స్థానం ఇచ్చారు.
దేహంలోని పంచ ప్రాణాలకు, పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని/ ఆహారాన్ని తప్పకుండా తినాల్సిందే.
మరి అలాంటి అన్నాన్ని వదిలి  పేలాల పిండి తింటే ఆకలి తీరదు కదా!
పేలాల పిండిని ప్రత్యేక సందర్భాల్లో  మాత్రమే తింటారు.
అది కూడా తొలి ఏకాదశి రోజున. పేలాల పిండి తినడానికి ఒక కారణం వుంది. పితృ దేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైనవి పేలాలు.అలా మన జన్మకు కారణమైన పూర్వీకులను ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజున తలుచుకుని వారి  పేరిట పేలాల పిండిని తినడం.మరో కారణం వర్ష ఋతువు ఆరంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. శరీరంలో కూడా మార్పు వస్తుంది.అలాంటి సమయంలో పేలాల పిండి తింటే శరీరానికి కావలసిన వేడి అందుతుందని.
ఇవన్నీ తెలిసీ నిత్యం తినే ఆహారమైన అన్నాన్ని వదిలి ఎప్పుడో ఒకసారి తినే పేలాల పిండినే రోజూ తింటాననే వ్యక్తిని అవివేకి,మూర్ఖుడుగా జమ కడతారా ! లేదా! జమ కడతారు కదా! అలాంటి వారిని ఉద్దేశించే ఈ "సక్తు న్యాయము"ను ఉదాహరణగా చెప్పారన్న మాట.
అదండీ 'సక్తు న్యాయము'లోని నిగూఢమైన అర్థం. ఎప్పుడో ఒకసారి తినాల్సినవి నిత్యం తింటే ఆరోగ్యానికి హానే తప్ప మేలు జరగదని ఈ న్యాయం ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు