ఋణానుబంధం:- సి.హెచ్.ప్రతాప్

 ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!! 


 ఋణానుబంధాల వలనే మనకు సంపదలు, పతీ, పత్నీ, పుత్రులు, పుత్రికలు మొదలైన అనుబంధాలు ఏర్పడుతాయి. మన ఋణము తీరగానే ఈ బంధాలు కూడా దూరమవుతాయి కాబట్టి వేటి మీద కూడా మొహాన్ని పెంచుకోరాదని పై శ్లోకం భావం.

ఋణానుబంధాన్ని విశ్వసించు అనేవారు శ్రీ సాయిబాబా. ఎవ్వరూ తమంతట తాముగ తన వద్దకు రారనీ, వారితో తనకు గల ఋణానుబంధం వల్ల తానే వారిని తన చెంతకు రప్పించుకుంటానని బాబా అనేక సందర్భాల్లో అన్నారు. అంటే, బాబాతో ఋణానుబంధమే లేకపోతే, మనమసలు సాయిభక్తులవడమే ‘తటస్థించ'దన్నమాట. ఈ ప్రబోధం ద్వారా ఋణానుబంధం యొక్క ప్రాశస్థ్యం అర్ధమౌతోంది.

మోక్షసాధనకు ఋనానుబంధం ఒక అడ్డంకిగా నిలుస్తుంది. మన నిత్య జీవితంలో మనం చేసే వివిధ కర్మల వలన అనేకమందితో ఋణానుబంధం అనే ఒక చట్రంలో ఇరుక్కుపోతాము. ఇందువలన పాపపుణ్యాలను అనుభవిస్తూ జనన మరణ చక్ర భ్రమణంలో తిరగాడుతూ వుంటాము.   


అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.
ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు – అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు.

జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి అని శాస్త్ర వాక్యం చెబుతోంది.

ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు ? 
కామెంట్‌లు