కలాం ఆపించిన పెళ్ళి;- .యామిజాల జగదీశ్.....

 అబ్దుల్ కలాం ఓ అమ్మాయి పెళ్ళిని అడ్డుకున్నారా అని అడిగితే అవునని చెప్పాలి.
ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పటి సంగతి ఇది.
అప్పుడు ఓ ఉన్నతాధికారిగా తమిళనాడులోని తిరుచ్చిలో పని చేస్తున్న కలియమూర్తి ఐపిఎస్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎవరి నుంచి అంటే అబ్దుల్ కలాం నుంచి.
నమస్కరాల తర్వాత చెప్పండి సార్ అని ఎంతో వినయంగా అడిగారు కలియమూర్తి.
 కలాం చెప్పారు...
మరుసటి రోజు జరగవలసి ఉన్న ఓ అమ్మాయి పెళ్ళిని ఎలాగైనా సరే ఆపాలి అని కలాం చెప్పారు.
కారణం, ఆ అమ్మాయి వయస్సు పదహారేళ్ళు. ప్లస్ టు చదువుతోంది.
ఆ అమ్మాయికి నలబై ఏడేళ్ళాయనతో పెళ్ళి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
పైగా అతనికి ఇది రెండో పెళ్ళి. అమ్మాయికి సొంత మామయ్య.
కలాం ఇంకా చెప్తున్నారు.
అది బలవంతంగా చేస్తున్న పెళ్ళి. అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. కనుకు మీరు ఈ పెళ్ళిని ఎలాగైనాసరే ఆపాలి అని చెప్పారు కలాం. ఇంకొక విషయం ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలని అనుకుంటోంది. ఆ ఆశ నెరవేరడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి అని కూడా చెప్పారు.
కలాం చెప్పిన మాటలన్నీ విన్న కలియమూర్తి అలాగే సార్. మీరు చెప్పినట్లే చేస్తానండి అన్నారు.
అమ్మాయిది ఏ ఊరండి అని కలియమూర్తి ప్రశ్న.
కలాం ఊరు పేరు చెప్పారు. తురయూరుకి పక్కనే ఉన్న ఓ గ్రామమది.
అంతే మరుక్షణం, కలియమూర్తి తన కారులో తురయూరు దిశగా బయలుదేరారు. బయలుదేరే ముందర ఆయన ముసిరి పోలీసు ఉన్నాతాధికారులకు ఫోన్ చేసి స్పాటుకి రమ్మన్నారు.  
కలాం చెప్పినట్లే ఆ పెళ్ళి జరగకుండా చేయగలిగారు కలియమూర్తి.
వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్లస్ టు అమ్మాయి సరస్వతి పోలీసులకు రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది.
సరైన సమయానికి వచ్చి పెళ్ళి జరగకుండా అడ్డుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది సరస్వతి.
సరేగానీ, నువ్వు ఇంకా చదవాలనుకుంటున్నావా చెప్పు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం అన్నారు కలియమూర్తి.
సరస్వతి చెప్పింది.
కలియమూర్తి ఆమె చెప్పిన వివరాలన్నింటినీ రాసుకున్నారు.
అనంతరం మేము వెళ్ళొస్తాం...కానీ మాకొక సందేహం....అని కలియమూర్తి అనగానే ఏమిటి సార్ అని అడిగింది సరస్వతి.
నీకోసం ఇంతలా అక్కర చూపించిన మన రాష్ట్రపతి సారుకి ఈ విషయం ఎనరు చెప్పారు అని అడిగారు కలియమూర్తి.
నేనేనండీ అంది సరస్వతి.
కలియమూర్తి ఆ మాటకు విస్తుపోయారు.
ఏమంటున్నావమ్మా...నువ్వా అని ఆశ్చర్యంగా అడిగారు కలియమూర్తి.
నువ్వు ఆయనకెలా చెప్పావు అని అడిగారు.
కొన్ని సంవత్సరాల క్రితం అన్నామలై యూనివర్సిటీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి అబ్దుల్ కలాం వచ్చారు. అప్పుడు ఆయన రాష్ట్రపతి కాదు.
కార్యక్రమానికి సరస్వతి కూడా వెళ్ళింది.
ఆ కార్యక్రమంలో కలాం ప్రసంగించిన తర్వాత ఇలా చెప్పారు...
మీలో ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా. నిర్భయంగా అడగొచ్చు.
అయితే ఇప్పుడు టైము తక్కువ ఉంది కనుక ఓ నలుగురు విద్యార్థులు మాత్రం అడగొచ్చు అన్నారు.
ఆ నలుగురిలో సరస్వతి కూడా ఒకరు.
కార్యక్రమం ముగిసింది.
కలాం బయలుదేరే ముందర ప్రశ్నలడిగిన నలుగురినీ దగ్గరకు పిలిచారు. ప్రశంసించారు.
ఇదిగో నా విజిటింగ్ కార్డు. మీకేదైనా అవసరమైతే నాకు పోన్ చేయవచ్చు అన్నారు.
ఆ విజిటింగు కార్డులో కలాం మెయిల్ ఐడీ ఉంది. ఫోన్ నెంబరు కూడా ఉంది.
ఆ విజిటింగు కార్డుని జాగర్తగా దాచుకున్నాది సరస్వతి. ఆ కార్డు ఈ ఆపత్కాలంలో ఆమెకు సాయపడింది.
సరస్వతి చెప్పిన ఈ విషయాన్నంత విన్న కలియమూర్తి ఆశ్చర్యపోయారు.
ఆ అమ్మాయి పై చదువులకు అవసరమైన సహాయం చేశారు.
అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది.
కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో....
కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కలియమూర్తి ఐపిఎస్ వెళ్ళారు.
ఆయన వేదిక ఎక్కి మాట్లాడిన తర్వాత ఓ అమ్మాయి స్టేజీ ఎక్కి మైక్ ముందు నిల్చుంది.
ఆ అమ్మాయి ఎవరనుకున్నారు...
ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందే అనుకున్నారు. కానీ గుర్తుకు రావడం లేదు.
అమ్మాయి గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది.
నాకీ అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. లేకుంటే ఇంతమంది సమక్షంలో నేనొక మంచి అవకాశాన్ని కోల్పోయి ఉండేదాన్ని అని ఏవేవో చెప్తోంది.
ఇంతకూ ఆమె ఎవరికి కృతజ్ఞతలు చెప్పబోతోంది.
కలియమూర్తికి ఏమీ అర్థం కాలేదు ఆ సమయంలో.
కలియమూర్తి సార్, నేను ఇక్కడ అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నా జీతం నెలకు మూడున్నర లక్షల రూపాయలు. నా భర్తకు నాలుగు లక్షలు. సంతోషంగా ఉన్నాం. నేనెవరో మీకు తెలుస్తోందా సార్....గుర్తు పట్టేరా సార్ అని కలియమూర్తి వంక చూసిందా అమ్మాయి.
తెలీలేదన్నారు కలియమూర్తి.
అ అమ్మాయి కళ్ళు కన్నీటితో తడిసాయి.
ఒకానొక కాలంలో బాల్య వివాహం నుంచి నన్ను కాపాడారు సార్. చదివించారు. నా పేరు తురయూర్ సరస్వతి అని చెప్పి నమస్కరించింది.
ఈ సంఘటనను ఏ మాత్రం ఊహించని కలియమూర్తి ఆనందానికి అంతులేదు. ఆయన కళ్ళూ చెమ్మగిల్లాయి.
మీకూ కృతజ్ఞతలు. అలాగే నా జీవితానికి వెలుగై ఉన్న అబ్దుల్ కలాం సారుకి కూడా కృతజ్ఞతలు అని వేదిక మీద నుంచి కిందకు దిగింది ఆ అమ్మాయి.
ఆశ్చర్యం కదండీ.
అలాగూ ఓ కాలముందన్న మాట.
తమిళనాడులో ఓ సాదాసీదా కుగ్రామంలో ఉన్న ఓ సామాన్యమైన అమ్మాయి రాష్ట్రపతితో సహజంగా సంప్రతించి మాట్లాడగలిగింది. ఇది ఊహించగలమా.
తాననుకున్నది సాధించింది సరస్వతి. ఇది ఆమెకు అందమైన కాలం. ....

కామెంట్‌లు