సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -304
సంగగుణ దోష న్యాయము
******
సంగ అంటే కలయిక, సహవాసం.గుణ అంటే గుణము ( మంచి లేదా చెడ్డది),ఒక సద్గుణము, ఫలము, త్రాడు,అల్లె త్రాడు,వీణ యందలి తీగె,ఆవృత్తి, గొప్పదనము, 3 అను సంఖ్య.దోష అంటే తప్పు,నింద, లోపము, నేరము, కీడు అనే అర్థాలు ఉన్నాయి.
సాంగత్యం వల్ల గుణదోషములు కలుగుతాయి అని అర్థము.
మరి ఎలాంటి సాంగత్యం వల్ల గుణ దోషాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. సజ్జన సాంగత్యం వల్ల సద్గుణాలు, దుర్జన సాంగత్యం వల్ల దుర్గుణాలు కలుగుతాయి.
సద్గుణాలు అంటే ఏమిటో చూద్దాం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మొదలైన వాటి కల్మషం అంటని వారు.మానవీయ విలువల జీవనది వంటి వారు.గంధపు చెట్టు వంటి వారు.
మరి ఎవరు సజ్జనులు? ఎవరు దుర్జనులు? తెలుసుకోవడం ఎలా? ఉప్పు కర్పూరము చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచిని బట్టి ఏదేంటో తెలుస్తుంది.మరి మనుషులంతా పైకి చూడటానికి ఒకేలా కనిపిస్తారు కదా!ఎలా? తెలుస్తుందనే సందేహం ఎవరికైనా వస్తుంది.
సజ్జనులు మానవ ధర్మ సారాన్ని తెలిసి వుంటారు.చిత్త చాంచల్యం ఉండదు.తాపత్రయాలు వుండవు.ఎన్ని కష్టాలు వచ్చినా పర్వతం వలె నిశ్చలమైన మనస్సుతో వుంటారు. దుఃఖితులైన వారికి ధైర్యాన్ని,ధర్మ తత్వాన్ని, జీవన విలువలను అవగాహన పరుస్తారు.
 
మన చుట్టూ ఉన్న సమాజంలో అలాంటి వారిని గమనించాలి. వారి సాంగత్యం, ఆశ్రయం పొందడానికి ప్రయత్నం చేయాలి. మనంతట మనమే వెతుక్కోవాలి. వారి వల్ల మనకు ఎలాంటి మంచి జరుగుతుందో కింది శ్లోకాన్ని చూద్దాం.
"గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా/పాపం తాపంచ దైన్యం చ హంతి సంతోమహాశయాః"
గంగానది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయి.అలాగే మహనీయుల, సజ్జనుల ఆశ్రయం, దర్శనం ఈ మూడింటిని పోగొడతాయని దీని అర్థము.
  అలాంటి వారి వల్ల పూల దండలో దారంలా జ్ఞాన పరిమళాన్ని పొందడమే కాకుండా గౌరవాన్ని కూడా పొందుతాం.
ఇక దుర్జన సాంగత్యం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.అది ఎప్పటికైనా ప్రమాదమే.ఏదో ఒక ప్రమాదాన్ని,ఉపద్రవాన్ని తెచ్చి పెడుతుంది.
కాబట్టి జీవన ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే "త్యజ దుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్"ప్రయత్న పూర్వకంగా ఎలాగైనా మానేయాలి.
ఈ "సంగగుణ దోష న్యాయము"ద్వారా మనకు మంచి చెడుల గుణ దోషాలుతెలిసాయి కదండీ! 
కాబట్టి మంచి వారి సాంగత్యం చేద్దాం. మన జీవితాలను చరితార్థం చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం