సుప్రభాత కవిత ; - బృంద
తీరని దిగులంతా తీరిపోయేలా
చేరని తీరాలు చేరువయేలా
తెరమాటున కోరికేదో వరించేలా
పొరలన్నీ తొలిగేలా  కనిపించే వెలుతురు

నీడలంటి కలతలన్ని కరిగిపోయేలా
తోడుగ నేనున్నానంటూ చేయికలిపి
వీడక వెన్నంటే వాడుకలా వచ్చి
పడనీయక అడుగడుగూ నడిపించే 
వెలుతురు

కల్ల నిజములు ఎరుకపరచి
మంచి చెడులకు తేడా చూపి
ఎల్లవేళలా కంటికి రెప్పలా కాచి
చల్లగ కాపాడే తల్లి లాటి
వెలుతురు

అడ్డేది వచ్చినా ఆగేది లేదంటూ
హితం కోరడంలో తగ్గేది లేదంటూ
జీవితంపై కోరిక పెంచి 
గమ్యానికై సాగే గమనానికి తోడొచ్చే
వెలుతురుకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు