సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -320
సవిశేషణేహి న్యాయము
*****
విశేషణం అంటే విశిష్ట చిహ్నము,గుణవాచక శబ్దము.సవిశేషణేహి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన గుణ సంబంధమైన విషయానికి చెందినది.
అంటే సవిశేషణమై యున్న విశేష్యము బాధింపబడినప్పుడు విధి నిషేధములు విశేషణమునకు సంక్రమిస్తుందని భావం.
అంటే ఏ వ్యక్తైనా సరే ఏదైనా చేస్తే ఫలితం అతడికే చెందాలి కానీ దానికి సంబంధించిన చెడు ఫలితాన్ని ఇతర వ్యక్తి పొందడమనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి ఓ సరదా అయిన ఉదాహరణ చూద్దాం...
ఒక వ్యక్తి అవసరార్థం మరో వ్యక్తి దగ్గర కొంత ధనాన్ని లేదా డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తీసుకునే సమయంలో తనపై నమ్మకం కలిగే విధంగా తెలిసిన వ్యక్తిని జామీనుదారుగా తీసుకుని వచ్చాడు.అంటే ఆ వ్యక్తి ఇతడికి షూరిటీ ఇచ్చాడు.కొన్ని కారణాంతరాల వల్ల అప్పు తీసుకున్న వ్యక్తి పరారైపోవడంతో జామీనుదారుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తినే బాధ్యుడిగా చేసి ఎగ్గొట్టిన సొమ్మంతా అతడి నుండి వసూలు చేయడం అన్న మాట.
 దీనినే తెలుగులో "పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు " అంటారు.ఏదో తెలిసిన వాళ్ళు కదా  మాట సాయం లాంటిది చేద్దాం అనుకుని జామీనుదారుగా సంతకం చేస్తే చివరికి వాళ్ళు కట్టాల్సిన అప్పంతా ఇతడి మెడకు చుట్టుకోవడమే కాకుండా వాళ్ళు తిట్టే తిట్లు, శాపనార్థాలు అన్నీ పడటం అన్నమాట.
కాబట్టి "తనకు మాలిన ధర్మం చేయకూడదు" అంటుంటారు పెద్దలు.అంటే కొందరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలనుండీ చేయలేక పోతుంటారు. అందుకని  వాళ్ళు  అడగ్గానే నమ్మి షూరిటీల మీద సంతకాలు చేయడమో మధ్యవర్తిగా ఉండి  ఇతరులతో ధన సహాయం చేయడమో లేదా పెళ్లి పేరంటాలకు  మధ్యవర్తిత్వం వహిస్తుంటారు.
ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పు కట్టే వ్యక్తి కట్టకుండా  పెట్టే యిబ్బందులు.ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తిగా ఉన్నతన్ని బాధ్యుడిగా చేసి   గొడవకు వచ్చి చికాకు చేస్తుంటారు.
 కాబట్టి "సవిశేషణేహి న్యాయానికి" ఆమడ దూరంలో వుండాలి. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ ఉన్న సమాజంలో తరచూ జరుగుతుండటం చూస్తున్నాం.అందుకే అమాయకత్వాన్ని వదిలించుకుని ఆచి తూచి అడుగులు వేయాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు