సుప్రభాత కవిత ; - బృంద
నాకమును తలపించే
భువనపు సొగసుల
కనులముందు నిలిపెగా
గగనాన నారింజరంగులు

అరుణోదయ తరుణాన
అవని అంతరంగ చిత్రం
అందమైన వర్ణాల
అపురూప సంగమం

తెలివెలుగులలో ఒలికిన
పసిడి వన్నెల కౌగిలిలో
కమనీయ కనకరాశిగా తోచె
హిమపర్వత సమూహము

మనోహర దృశ్యాల
మధుర కవనాలు
మనసులో నింపెను
మోహన రాగాలు

కోరికల బోయీలు మోసే
వెలుగుల పల్లకిలో
వరముల మోపులు తెస్తూ
నింగిని ప్రభవించె కాంతిరథం

ప్రతి భావము రమణీయమై
ఉత్సాహపు ఉప్పెనలు
విరివనాన సుమగంధంలా
జగతినంతా ఆవరించెను

రారమ్మని  చేరబిలిచి
చేకొమ్మని దోసిలి నింపి
కన్నులపండుగ చేసికొమ్మని
రంగుల కలలేవో  పూయించి

అనంతమైన ఆనందాలను
దిగంతాలకు ప్రసాదించే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు