బంజారా దీపావళి పండుగ విశిష్టత... రాథోడ్ శ్రావణ్ ఆదిలాబాద్
 బంజారా సమాజంలో దీపావళి పండుగను "దవాళి" అంటారు. ఈ పండుగను వారు రెండు రోజులు జరుపుకుంటారు.
🔹మొదటి రోజు అనగా లక్ష్మీపూజ రోజు పెళ్ళి కాని అమ్మాయిలు మట్టి
దీపాలు, దిపాంతారాలు (ఢాకణీ) తీసుకోని ఊర్లో ఇంటింటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ కానుకలు ( మేరా) అడుగుతారు.పూర్వకాలంలో అమ్మాయిలకు కానుకగా  డబ్బులు లెనప్పుడు  బెల్లాన్ని  కానుక రూపంలో ఇచ్చేవారు.
 🔹రెండో రోజు "గోధన్ పూజ" చేస్తారు. గోవు పేడతో  గొబ్బెమ్మలు తయారు చేసి పూజిస్తారు.

దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజు వచ్చే పండుగ. సంపూర్ణ అమావాస్య రోజున జరుపుకునే పండుగ కాబట్టి లంబాడీ గిరిజనులు ఈ పండుగను "కాళీమావస్" అని అంటారు.వీరు దీపావళి అంగడికి వెళ్ళెటప్పుడు కుటుంబ సభ్యులందరిని తీసుకొనివెళ్ళి  అమ్మాయిలకు అలంకరణ వస్తువులు, గాజులు,  కొత్త బట్టలు,టపాకాయలు,రాకెట్లు,చిచ్చుబుడ్లు,భూచక్రాలు,సూర్సుర్ బత్తిలు,లక్ష్మీ బాంబులు ఇప్పిస్తారు. అదే సంవత్సరం పెళ్ళి అయిన అమ్మాయిని పండుగకు తల్లిదండ్రులు ఇంటికి తీస్కో వస్తారు.
ఈ పండుగను
 పురస్కరించుకుని ఇంటిని శుభ్రం చేసి ఇంటికి రంగురంగులతో,బంతిపువ్వులతో అలంకరణ చేస్తారు. సాయంత్రం సమయంలో  తాండా నాయక్  పిలపుతో  కారోభారి తాండాలో తిరిగి దీపాలు వెలిగించాలని ఆదేశిస్తాడు.అప్పుడు తాండావాసులు దీపాలు వెలిగిస్తారు. నూతనంగా పండించిన ధాన్యాల పైన లక్ష్మీ దేవి యొక్క  ప్రతిమను కూర్చోబెట్టి పూజిస్తారు.అసలైన లక్ష్మీ అయిన గోమాతను పూజించండానికి రాత్రి వేళల్లో యువతులు, మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి వివిధ రకాల మట్టి దీపాలతో ఇంటి ముందు పశువులు కట్టిన చోటికి వెళ్ళి పశువులకు దీపాలు,హారతి చూపించి శుభాకాంక్షలు తెలుపుతూ కానుక (మేరా) అడుగుతారు. 
వర్షే దనేరి కోట్ దవాళీ లాల్మీతోన మేరా  అని అంటారు.
తాండా అమ్మాయిలందరు ఒక చోట గూమి గూడి పాటలు పాడుతు  తాండా నాయక్,కారోభారి,డావ్,  ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తేలుపుతారు. తమ సంప్రదాయం ప్రకారం తాండాలో ఇంటింటికి  తిరుగుతు ఈ విధంగా పాటలు పాడుతూ కానుకలు అడుగుతారు.
  
రాత అంధేరియె,దీవలోబాళేలిజో !
గర సకరాయియే,మకరాయి కరేలిజో !
పాణిరో టోటోయే,కువలో ఖోదాలిజో !
లకడిరో టోటోయే,మోళి బాందేలిజో !
ఈ విధంగా పాటలు పాడి వారి కుల దేవతలు అయిన మేరమ్మ యాడి,సంత్ సేవాలాల్ మహారాజ్, మరియు తాండా నాయక్, కారోభారిలకు ఇలా అందరికి కానుకలు(మేరా) అడుగుతూ 
వర్షే దనేరి  కోట్  దవాళి మేరామా తోనే మేరా !
వర్షే దనేరి కోట్  దవాళి సేవాభాయా తోనే మేరా!
వర్షే దనేరి కోట్  దవాళి నాయక్ తోన మేరా !
వర్షే దనేరి కోట్ దవాళి కార్భారి తోన మేరా!
వర్షే దనేరి కోట్ దవాళి  లాల్మీతోన మేరా!
అని లాల్మీ పేరుతో పిలవబడే గోమాతను కానుకలు అడుగుతారు.తాండాలోని ఆడ పిల్లలు వాళ్ళ‌వాళ్ళ రక్తసంబంధికుల ఇంట్లో వెళ్లి 
వర్షే దవేరి కోట్  దవాళి బాపు తోనే మేరా !
వర్షే దనేరి కోట్  దవాళి యాడి తోన మేరా!
అని ఈ విధంగా చెప్పుకుంటూ తాతయ్య, నాన్నమ్మ , అక్కకు, అన్నయ్యకు,బాబాయికి, మామయ్యకు  ఇలా అందరికీ కానుకలు అడిగి శుభాకాంక్షలు తెలియజేస్తారు. బంజారా సమాజంలో అమ్మాయిలను లక్ష్మీగా భావిస్తారు. వీరు వెళ్ళిన చోట అభివృధ్ధి జరుగుతున్నందని ఆడ పిల్ల ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని వీరు భావిస్తారు.

 రెండో రోజు ఇంటిని శుభ్ర పరచి  తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి 
 ప్రొద్దున నూతనంగా పండించిన  ధాన్యాలతో రకరకాల వంటకాలు ఖీర్,సేవే,లాప్సి ,కడావ్, తయారు చేసి నైవేద్యాన్ని తమ దేవతలకు, కులదేవతలకు, చనిపోయిన సంబంధికులకు నైవేద్యం (ధప్కార్) సమర్పించి మొక్కుకుంటారు. ఆ రోజు అమ్మాయిలందరు ఉపవాసం ఉంటారు. పది పదకొండు గంటల సమయంలో తాండా అమ్మాయిలందరూ పూల కోసం పొలాలుకు వెళ్ళే టప్పుడు తమ వెంట ఫలాలు, అల్పాహారాలు,టపాకాయలు తీసుకోని వెళ్తారు. 
వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ ,టపాకాయలు కాల్చుతు ఆనందిస్తారు. సంతోషంతో  వివిధ రకాల అందమైన పుష్పాలు బంతిపూలు (గల్బాజేర్ పూల్) కోడిజట్టు పువ్వులు ( లాంబడిర్ పూల్) తామర (కమళేర్ పూల్) గులాబీ పూవ్వు (గులాబేర్ పూల్) గుమ్మడి పూవ్వు(కోళార్ పూల్)గడ్డి పువ్వు (ఖడేర్ పూల్) మొదలగు పువ్వులు తీసుకొని తాండాకు వస్తారు. వస్తూ వస్తూ  ఈ విధంగా పాటలు పాడుతారు
వీరారే దామణేతి ఛూటియే బాళేదా,
డుంగరేతి అలసో మోర్.
ధూరియాయె
ధూరియా మతహీండో సాతణో,
ధూరియాప,భూరియా గమాయోయ ఆజ్.
పేనా వెతితి లాంబడి డుంగర్ ఖోళామ్,
అబే అయి లాంబడి గోధనేమ.
 అని పాటలు పాడుతూ ముందుగా తాండా నాయక్ ఇంటికి వెళ్ళి ఆవు‌పేడాతో గొబ్బెమ్మలు తయారు చేసి దాని పై పువ్వులతో బతుకమ్మను అలంకరించి నట్టు  అలంకరిస్తారు. దానినే "గోధన్ పూజ" అంటారు. ఆ తర్వాత తాండాలోని అందరి ఇంటిముందు గోధన్ చేసి
మరోసారి మజ్జిగ,జోన్నపిండి, వేసి అగర్బత్తులు ముట్టించి రూపాయి నాణెం మరియు ఒక రకమైన కట్టెలు "బరుర్ లక్డీ" పెట్టి  పూజలు చేసి గోధన్ పైన బంజారాల పవిత్రమైన వస్త్రం  "ఫూలియా ‌గ‌ణ్ణో "కప్పి  అమ్మాయిలు గోధన్  పాట పాడుతారు. 
హుడరే హుడ్ గాయిగోట్య ఫూడ్,
కేవడ్య మేవడ్య బాండియ్యా, బుచ్చియ్యా ధోళేరి కటారే‌ లాంబిలేరే ధోళిహరే సెస్ బంది సాత్‌ జోడి బళ్దేర్ జోడి,నంగారార్ ఠోళి,టోక్ణీస్ మాతేర్ ఛాదళాస్ కానేర్ దోడ్డిభరి గావ్డీ‌ తళావ్ మరో ఆన్, ధన్ లావా లష్కర్ దవాళి మాత మార్ సోనూర్ టాంగేర్ ౠషి కరేష్ అని 
ఈ విధంగా ‌ఇంట్లో ఎంత మంది కుమారులు ఉంటే వాళ్ళు పేరుతో గోధన్ పెట్టి పూజ చేసి అందరు బాగుండాలని సిరి సంపదలతో కళకళ లాడాలని ఆశీర్వాదం ఇస్తారు.
ఆ సమయంలో  వీళ్ళకు ఇంటి పెద్దావారు అందరికి తనకు తోచిన విధంగా డబ్బులు కానుకగా ఇస్తారు. 


దీపావళి పండుగ కూడా పెళ్ళి కాని అమ్మాయిల పండుగ అని చెప్పవచ్చు.  ప్రకృతి యొక్క అందం పువ్వుల్లో కన్పిస్తుంది కనుక దీపావళికి మరియు ప్రకృతికి అవినాభావ సంబంధము  ఉందని బంజారా పెద్దలు చెప్పుకుంటారు.ఈ పండుగలో ఆవులను జాజుతో అలంకరించి పూజలు చేయడం,ఇసురు రౌతును కూడా జాజుతో అలంకరించడం వీరి ‌ సంస్కృతిలో ఒక భాగం.
వీరి జీవన ప్రయాణంలో
లదణి ఒక భాగం ఆదిమానవుడు అనుసరించిన విధానం బ్రతుకుతెరువు కొరకు సాగించే ప్రయాణంలో వీరు సమూహాలుగా జీవించేవారు. ఒక్కోసమూహంలో ఇరువై నుండి ఇరువై ఐదు కుటుంబాలు ఉండేవి.ఒక్కో కుటుంబానికి వందనుండి నూటా ఏభై గోవులు(గావ్ డి)  ఉండేవి.అందుకే
గోమాతను పూజిస్తారు. సంచార జీవనంలో తమ యొక్క వస్తువులను చేరవేయడానికి,ఉప్పు వ్యాపారం చేసినపుడు, సంచారంలో గోవులు ఉపయోగపడ్డాయి.సంచార జీవనం నుండి ‌స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని జీవించే క్రమంలో, నాగలి దున్నడానికి, బండి  లాగడానికి, పశువులు ఉపయోగపడ్డాయి.చివరికి గోవు మూత్రమును కూడ ఇండ్లలో, వాకిట్లో
చల్లుతారు.గోవు మూత్రం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయని వీరి నమ్మకం.‌ ఆవు పేడ పంట పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.అందుకే గోవుతో ఉన్న అనుబంధం దృష్ట్యా గోవును అసలైన లక్ష్మీ మాత అని దీపావళి రోజు  పూజిస్తారు.
 రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్, ఉట్నూర్ ఆదిలాబాద్  9491467715.
కామెంట్‌లు