ఓటు ( కవిత) అచ్యుతుని రాజ్యశ్రీ
ఓటు ఓటు ఓటు ! ఆలోచించి వేయకుంటే జనాలపై వేటు
పెరిగే ధరలతో దొరకదు సాపాటు

వేడి వేడి బిర్యానీకి ఆశపడ్తివో
అన్నమో రామచంద్ర అంటూ అగచాట్లు
మద్యంకై చేతులు చాస్తే
బతుకంతా చూడాలి చుక్కలు

ఈరోజు పొందుతావు నోట్లకట్టలు
రేపు బీటలు వారే ఆనకట్టలు

దసరా వేషాలకన్నా మిన్న
రోజూ బాజా భజంత్రీలతో
ఇంటింటికి నేతలు

దోసెలు వేస్తారు మంచినీరు పడ్తారు
పిల్లని ముద్దాడి ఆటలు పాటలతో మురిపించి
టక్కుటమారాల బండీలో ఎక్కించి ఐదేళ్ల బందీఖానా

నేడు చకచకా సాగు పనులు
గద్దె ఎక్కాక విందులు పదవుల
పంజారాలతో జనాలు వలలో చేపలు
పార్టీలు మారేటి కప్పలు
ఎంచక్కా వేస్తాయి కుప్పి గంతులు
పదవిరాకుంటే ఊసరవెల్లులు

బిక్కమొహాల్తో బిక్కుబిక్కుమంటూ జనాలు
కోతి వల్ల మోసపోయిన పిల్లులు

ఆచితూచి వేయాలి ఓటు
అన్యాయం అక్రమాలపై వేటు
ప్రజాశక్తి తెలియాలి
సామాన్యుల రాతలు మారాలి
చేయవద్దు తప్పు
ఓటుతో తొలగాలి ముప్పు🌷
కామెంట్‌లు