సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -314
సన్న్యాసి యోషా న్యాయము
*****
సన్న్యాసి అంటే ప్రాపంచిక సంగమమును విడిచిన వాడు.సన్న్యాసాశ్రమమును స్వీకరించిన వాడు.యోషా అంటే స్త్రీ,తరుణి.
 సన్న్యాసి అనే వాడు పూర్తిగా బంధుత్వాలు, కోరికలు తెంచుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఐహిక సుఖాలకు దూరంగా ఉండాలి.
సన్న్యాసి అంటే చిత్తాన్ని/ మనసును సత్తు నందు  అనగా సత్యము నందు న్యాసము అనగా నిక్షేపము చేసిన వాడు అని అర్థం. ఈ విధంగా హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలను త్యజించిన వ్యక్తిని సన్న్యాసి అంటారు.
మరి అలాంటి సన్న్యాసి  ఏం చేయాలి? ఎలా వుండాలో చూద్దాం.
సంసార సాగరాన్ని వీడి,బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సత్యాన్వేషణకై దైవ మార్గాన్ని అవలంబించాలి. ప్రాపంచిక కార్యకలాపాలను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా  కట్టుబడి ఉండాలి.స్వీయ క్రమశిక్షణను పాటిస్తూ విలాసాలకు దూరంగా ఉండాలి.ఆధ్యాత్మిక సంప్రదాయాల జ్ఞానాన్ని అందించేందుకు బోధనలను నిర్వహిస్తూ విలువల సంరక్షణ చేయాలి.
మరలాంటి ఒకానొక సన్న్యాసి ఏమని కోరుకున్నాడట.తాను సన్న్యాసి కావాలి.అంటే అందరితో గౌరవం పొందాలి. సన్న్యాసి అంటే అందరూ గౌరవిస్తారు కదా! 
కానీ ఆ వ్యక్తి కోరిక అంతటితో ఆగితే మనమీ న్యాయము జోలికే వచ్చే వాళ్ళం కాదు. సన్న్యాసిగా వున్న ‌తనకు మంచి అందగత్తె తోడు కావాలట.ఇవి రెండూ ఒకే స్థితియందు కావాలంటే కుదురుతుందా? ఎవ్వరి దగ్గర నుంచైనా ఠకీమని జవాబు 'అస్సలు కుదరదు గాకా కుదరదనే' వస్తుంది కదా!.
అలాంటి ప్రబుద్ధులు, ఇలాంటి విరుద్ధ భావాలు గల వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారని,  ఉంటారని తెలియజేసేందుకే  ఈ "సన్న్యాసి యోషా న్యాయము"ను మన పెద్దలు నిశితంగా పరిశీలించి సృష్టించారు.
 యోగి వేమన అసలైన సన్న్యాసి లేదా యోగి గురించి ఏమన్నారంటే...
"ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి/ గోచి బిగియగట్టి గుట్టు దెలిసి/నిలిచినట్టి వాడె నెఱియోగి యెందైన/ విశ్వధాభిరామ వినురవేమ!"
తాత్పర్యం" ఆశను కోసి ,అగ్ని యందు చల్లార్చి తన గోచి బిగియగట్టి,ఈ జన్మ లక్షణములను తెలుసుకున్న వాడే యతీశ్వరుడు.అతడినే సన్న్యాసి లేదా యోగి అంటారు" అని చెప్పారు.
అంటే సన్న్యాసి అయ్యే వాడు,లేదా అయిన వాడు తక్షణమే చేయాల్సింది ఏమిటంటే"కోరికల్ని మొదలంటా నరికేసుకోవాలి.మనసులో చెలరేగే వ్యామోహమనే నిప్పును చల్లార్చుకోవాలి. కామ క్రోధాలకు దూరంగా ఉండాలి ‌అలా ఉన్నప్పుడే బ్రహ్మ రహస్యం  తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్న వాడే, పంచేంద్రియాలను జయించి,కర్మలకు అతీతుడై వాడే అసలైన సన్న్యాసి అన్నారు.
మరలా కాకుండా  'విరుద్ధ భావాలతో చరించే వాడు ఎప్పటికీ అసలైన సన్న్యాసి కాడు, కాలేడు' అని ఈ "సన్న్యాసి యోషా న్యాయము" ద్వారా తెలుసుకున్నాం.
అలాంటి  విరుద్ధ భావాల మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎవరైనా మన దృష్టికి వేస్తే వారి అసలు స్వరూపాన్ని, మోసకారి తనపు గుట్టును బట్టబయలు చేయాల్సిందే...
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు