న్యాయాలు -329
సికతా కూప న్యాయము
******
సికతా అంటే అంటే ఇసుక. కూప అంటే బావి.
ఇసుక దిబ్బలో తీసిన బావి అని అర్థం.
ఇసుక నేలలో బావి తీస్తే ఒడ్డు నిలువక విరిగిపోతుంది.కూలిపోతుంది.
దీనినే వ్యక్తి యొక్క బుద్ధితో పోల్చారు."వినాశకాలే విపరీత బుద్ధి" అన్నట్లు వినాశకాలం వచ్చినప్పుడు ఇతరులు కూలదోయక ముందే తమకు తామే ఇసుక నేలలోని బావి వలె సర్వం పోగొట్టుకుని అగాధంలోకి కూరుకుపోతారు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
"సికతా కూప న్యాయానికి" సమాంతరంగా ఉన్న సామెత 'వినాశ కాలే విపరీత బుద్ధి' అని తెలిసింది కదా. మరి దాని గురించి లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.
అప్పటి వరకు మంచిగా వున్న వ్యక్తిలో అనూహ్యంగా వచ్చే మార్పు అన్నమాట. వచ్చే మార్పేదో మరికొంత మంచిగా వుంటే ఐతే ఫరవాలేదు. కానీ మంచికి విరుద్ధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. జరుగుతున్న వాటిని, కళ్ళముందు కనిపించే వాటి గురించి విచక్షణతో ఆలోచించక తన భవిష్యత్తు నాశనమయ్యే దోరణిలో ప్రవర్తించడం. ఇలా చేయడం వల్ల ఎవరో ఆ వ్యక్తికి పనిగట్టుకుని హాని చేయక్కర లేకుండా తనకు తానే హాని కలిగించుకుని పతనావస్థకు చేరడాన్నే వినాశ కాలే విపరీత బుద్ధి అంటారు.
సికతా కూపము అంటే కూడా అదే అర్ధం. తెలివైన వ్యక్తి ఎవరైనా ఇసుకలో బావి తోడుతారా? తోడితే అది నిలుస్తుందా? అలా చేయడమంటే కొంత అహంకారపూరిత చర్యే అనొచ్చు.విచక్షణా జ్ఞానం కోల్పోయి ఇతరులు చెప్పినా వినే పరిస్థితిలో లేక పోవడమని కూడా అనొచ్చు.
దీనికి సంబంధించిన ఉదాహరణలు రామాయణ, మహా భారతంలో ఉన్నాయి.
"న నిర్మితో వై నచ దృష్ట పూర్వో/ న శ్రూయతే హేమ మయం కురంగః/ తథాపి తృష్ణా రఘు నందనస్య/ వినాశ కాలే విపరీత బుద్ధిః"
బంగారు లేడి ఉన్నదని ఎన్నడైనా? ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా అయినప్పటికీ రాముడు తన సీత కోరిందని ముందూ వెనుకలు ఆలోచించకుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు.ఇలా వినాశకాలం వచ్చినప్పుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడు కాలం వచ్చినప్పుడు ఎవరి మాటా వినబుద్ధి కాదు. ఆలోచన మందగిస్తుంది.అంటే రాముడంతటి వానికే తప్పలేదనే విషయాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో చెప్పినట్లుగా ఈ శ్లోకంలోని చివరి పాదం చెబుతోంది.
మహా భారతంలో కూడా ఈ ప్రస్తావన ఉంది.కౌరవుల దుశ్చర్యల గురించి మాట్లాడుతూ కురుక్షేత్ర సంగ్రామంలో వారంతా మరణించినప్పుడు సంజయుడు దృతరాష్ట్రుడితో వారి వినాశనానికి, తామంతా చనిపోవడానికి వారే కారకులు అంటాడు.
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొన్నింటిని చూసి మన పెద్దలు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు.
"అళీ - కుళీ- వృశ్చిక - వేణు - రంభా/ వినాశ కాలే ఫలముద్వహన్తి/యథా తథా సజ్జన - దుర్జనాం/ వినాశ కాలే విపరీత బుద్ధిః" అంటే తుమ్మెద - పీత - తేలు -వెదురు- అరటి- ఇవి తమకు నాశనకాలం వచ్చినప్పుడే ఫలిస్తాయట. అలాగే సజ్జనులకూ, దుర్జనులకూ పోగాలము వచ్చే ముందు విపరీత బుద్ధులు పుడతాయని భావము... ఈ ఐదు ప్రత్యుత్పత్తి కాగానే మరణిస్తాయని మనందరికీ తెలిసిందే.
అదండీ విషయం! మొత్తానికి "సికతా కూప న్యాయము" వల్ల అనేక విషయాలను తెలుసుకునే అవకాశం కలిగింది.
మరి దీని ద్వారా ముఖ్యంగా గ్రహించాల్సింది ఒకటి వుందండోయ్. మన బుద్ధి, మనస్సు పెడదారి పట్టకుండా గుర్రాన్ని అదుపు తప్పకుండా చూసుకునే రౌతులా వుండాలి.అప్పుడే వినాశకాలం రాకుండా విజయవంతంగా జీవిత కాలాన్ని పూర్తి చేసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి