ఘనంగా బాలిక పుట్టిన రోజు వేడుకలు
 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో 3వ తరగతి చదువుతున్న బాలిక బుద్ధుల సాన్వి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య గత పది సంవత్సరాలుగా ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలబాలికల పుట్టినరోజు వేడుకలను తన సొంత ఖర్చులతో గణనీయంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం అందంగా ముస్తాబై పాఠశాలకు వచ్చిన బుద్ధుల సాన్వి పుట్టినరోజు విషయాన్ని తెలుసుకొన్న ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కేక్ తెచ్చి  ఉపాధ్యాయినులు సమత, భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రుల మధ్య బాలిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలందరికీ, కేక్ చాక్లెట్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయినులు చిన్నారి సాన్వికి కేక్ తినిపించారు.  బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని దీవించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ స్నేహితురాలు పుట్టిన రోజు వేడుకలు పాఠశాలలో జరపడంతో వారు మిక్కిలి సంతోషపడ్డారు. 
ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లల ఆనందం కోసం, వారి రోజువారి హాజరు శాతాన్ని పెంచేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను పాఠశాలలో చేపడుతున్నామన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని, ఎఫ్ఎల్ఎన్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధన గణనీయంగా జరుగుతుందన్నారు. కష్టపడి సంపాదించిన వేలాది రూపాయలను వృధా చేసుకోకుండా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు, కర్ర సమత, చెన్నూరి భారతి, డాన్స్ మాస్టర్ పురుషోత్తం శ్రవణ్, పిల్లల తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన సిబ్బంది విజయ, సుశీల, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు