సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -306
సంధిగ్ధే న్యాయఃప్రవర్తతే న్యాయము
*****
సంధిగ్ధే అంటే సందేహ పడిన, సంశయపడిన.న్యాయః అంటే తగవు , స్వధర్మం వలన చలింపకుండుట, తర్కశాస్త్రము,పద్ధతి,అర్హత,మర్యాద,చట్టము,పుణ్యము,వ్యాజ్యము, తీర్పు, మంచి ప్రభుత్వము,పోలిక, సంబంధము,సూత్రము,దృష్టాంతము,తత్త్వశాస్త్రము,నీతి అనే అనేక అర్థాలు ఉన్నాయి.ప్రవర్తతే అంటే జరుగుతున్న, నడుస్తున్న,నిర్వహిస్తున్న అని అర్థం.
సంధిగ్ధాంశము లేదా  సంశయపడే విషయం అయినప్పటికీ దాన్ని అలా వదిలేయకుండా విచారింపవలయును అనే అర్థంతో ఈ సంధిగ్ధే న్యాయఃప్రవర్తతే అనే న్యాయము చెప్పబడింది.
ఏదైన విషయం ఎంత సంధిగ్ధాంశముగా ఉన్నప్పటికీ, ఎంతకూ తేలకుండా యిబ్బంది పెడుతున్నప్పటికీ ఇక సాధ్యం కాదనుకుని అంతటితో‌ వదిలివేయకూడదు.దానిని విడువకుండా సవిమర్శముగా విచారిస్తూనే వుండాలి.అప్పుడే అందులోని లోతుపాతులు తెలుస్తాయి.ఏమైనా భ్రమలు, అపోహలు ఉంటే తొలగిపోతాయి.కాబట్టి అసలైన అంతరార్థం తెలిసేంతవరకూ మన ప్రయత్నం,మానవ యత్నం   కొనసాగుతూనే వుండాలన్న మాట.
ఈపాటికి అర్థమయ్యే వుంటుంది.ఇది శాస్త్రీయతతో పాటు తాత్త్విక,ఆధ్యాత్మిక చింతనకు కూడా సంబంధించినదని.
తాత్త్వికత విషయాలను చెప్పే శాస్త్రం తత్త్వశాస్త్రము. ఈ శాస్త్రం ఉనికి, కారణం, జ్ఞానం,విలువ,మనస్సు మరియు భాష వంటి అంశాలకు సంబంధించిన సాధారణ మరియు ప్రాథమిక సంబంధిత ప్రశ్నల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేస్తుంది.
తత్త్వ వేత్తలు తాత్త్విక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించారు. అందులో సంభావిత విశ్లేషణ, ఇంగిత జ్ఞానం, అంతర్ దృష్టి, ఆలోచనల ప్రయోగాలు మొదలైనవి ముఖ్యమైన పద్ధతులుగా చెప్పారు.
ఇలా సంధిగ్ధమైన అంశాలను అనేక కోణాల్లో అధ్యయనం మరియు ప్రయోగాలు చేస్తూ సంధిగ్ధావస్థ నుండి సప్రయోజన దిశగా  విచారించడాన్ని "సంధిగ్ధే న్యాయఃప్రవర్తతే న్యాయము" అంటారు.
మనసు యొక్క తత్త్వాన్ని బట్టి కానీ, వయసు రీత్యా గానీ ఇలాంటి సంధిగ్ధావస్థలు అనేకం వస్తూనే వుంటాయి. వాటిని తాత్త్విక,ఆధ్యాత్మిక భౌతిక కోణాల్లో పరిష్కరించుకునే సమయంలో  వెన్న కోసం మజ్జిగ బాగా చిలికినట్టు మనసును చిలుకుతూ, ఈ విధంగా విచారిస్తూనే వుండాలి.అప్పుడే అసలేంటో బోధ పడుతుందన్న మాట.‌మరి నాతో ఏకీభవిస్తారు కదా!
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు