సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -310
సచ్ఛిద్ర ఘటాంబు న్యాయము
******
సత్ అనగా ఉనికి,ఉండుట ,సత్యము వాస్తవము,మంచిది.ఛిద్ర అంటే బెజ్జము, దోషము,న్యూనత.ఘట అంటే మట్టితో చేసిన కుండ, కూజా, నీరు పోసుకునే పాత్ర, కుంభరాశి, ఏనుగు కుంభస్థలము,, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను నిలుపు చేయుట, ఇరువది ద్రోణముల పరిమాణము అనే అనేక అర్థాలు ఉన్నాయి.అంబు అంటే నీరు.
సచ్ఛిద్ర ఘటాంబు అంటే చిల్లికుండలో నీళ్ళు పోసిన విధంగా అని అర్థము.
చిల్లి పడిన కుండలో నీళ్ళు పోస్తే ఎలాగూ నిలువవని మనందరికీ తెలిసిందే.
దీనినే మనుషుల మనస్తత్వానికి వర్తింప చేస్తూ జ్ఞానోదయం కలిగించేలా ఓ పద్యాన్ని రాశారు వేమన గారు. అదేంటో చూద్దామా...
 "అరయ తరచు కల్లలాడెడు వారిండ్ల / వెడల కేల లక్ష్మి విశ్రమించు/ ఓటికుండ నీరు వోసిన చందాన/ విశ్వదాభిరామ వినురవేమ!"
భావం ఏమిటంటే అదేపనిగా మోసం చేసే వారి ఇళ్ళలో సంపద ఎక్కువ కాలం నిలవకుండా వెళ్ళి పోతుంది.చిల్లులు పడిన  ఓటుపోయిన  కుండలో నీళ్ళు పోస్తే కారిపోతాయి  కదా! అలాగే మోసం చేసే వారి ఇళ్ళలోనూ, ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వారి ఇళ్ళలోనూ ధనలక్ష్మి ఉండదని అర్థం.అంటే మనిషి వ్యక్తిత్వ పరంగా సరిగా లేకపోతే డబ్బు పరంగా కూడా దరిద్రం అనుభవిస్తాడు అనే అర్థంతో ఈ పద్యం చెప్పబడింది.
అంటే ఇక్కడ మన పెద్దవాళ్ళు  మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఓ కుండతో పోల్చారు.కుండలో నీళ్ళు పోస్తే ఒలక్కుండా,తొణక్కుండా తనలో దాచుకొని చల్లదనాన్ని ఇస్తుంది.దాహం తీరుస్తుంది.మంచి మనిషి వ్యక్తిత్వం కూడా  కుండలాంటి  మంచి మనసుతో వుండాలి.కష్టాలు,నష్టాలు, సుఖము దుఃఖము ఏవీ కలిగినా సంయమనం పాటిస్తూ సత్యం, ధర్మం,నీతి,నిజాయితీ మొదలైన విలువల వ్యక్తిత్వాన్ని  వీడకుండా వుండటం అన్న మాట.
అలాంటి వారి ఇళ్ళలో లక్ష్మి డబ్బు రూపేణా  ఉన్నా లేకపోయినా సద్గుణ సంపదలక్ష్మి సదా కొలువై వుంటుంది.
 
అబద్ధాలు,అసత్యాలు చెప్పే వారి ఇంట ధనలక్ష్మి ఒకవేళ ఉన్నా  ఎక్కువ కాలం నిలువ వుండదు.చిల్లుకుండలో నీళ్ళు కారి నేలపాలైన విధంగా అసత్యవాది , అబద్ధాల కోరు ఇంటా వంటా సద్గుణ లక్ష్మి అసలే ఉండదు.ఆ వ్యక్తి  మానసికంగా విలువల సంపద కరువైన దరిద్రుడు అన్న మాట.
కాబట్టి "సచ్ఛిద్ర ఘటాంబు న్యాయము" వలె కాకుండా నిండుకుండలా కళకళలాడుతూ మన హృదయంలో సకల శుభాలను,సమాజంలో గౌరవాన్ని కలిగించే సద్గుణ లక్ష్మిని  సదా కొలువై వుండేలా చూసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు