సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -322
సామర్థ్య యోగ న్యాయము
******
సామర్థ్యము అనగా నేర్పు,శక్తి,యోగ్యత,మంత్రి,సభ యందు వుండు వాడు,ఒక సమాజంలో చేరి యున్న వాడు అనే అర్థాలు ఉన్నాయి.
యోగ అనగా కలుపుట, కలయిక,మిశ్రణము, సంబంధము,పొందుట, ప్రయోగము, పద్ధతి, పరిణామము,,బండి, యోగ్యత, అదృష్టము, అర్హత, కవచము,పని, ఉపాయము, భాగ్యము, ధ్యానము,ప్రయత్నము, సమయము ,చికిత్స, ఇంద్రజాలము, ఆధారము ,ప్రాప్తి,చిత్త వృత్తి నిరోధము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
సామర్థ్యము/ నేర్పు వలన చేయాల్సిన పనులు నెరవేరుతాయి అని అర్థం.
ఎవరెవరు ఏయే పనులు ఎంచుకుంటారో,అలా ఎంచుకున్నవి  నెరవేరాలంటే వారి వారి సామర్థ్యాలు దోహదం చేస్తాయి.
ఈ సృష్టిలో అందరూ ఒకేలా జన్మించినప్పటికీ సామర్థ్యాల విషయంలో ఒకేలా ఉండరు.మానసిక, శారీరక లక్షణాలను బట్టి వారి సామర్థ్యాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే.
ఇంతకూ సామర్థ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం.
ముందుగా  భౌతిక శాస్త్ర ప్రకారం చూసినట్లయితే సామర్థ్యం అంటే పని చేయడం యొక్క రేటు.ప్రతి యూనిట్ సమయం ప్రకారం వినియోగించబడిన శక్తి యొక్క మొత్తం. ఈ విధంగా భౌతిక శాస్త్ర వేత్తలు శక్తిని పని చేసే సామర్థ్యంగా నిర్వచించారు.
ఈ విధంగా సామర్థ్యంలో శక్తితో పాటు తెలివి తేటలు, నైపుణ్యం, మేధస్సు,నేర్పు అన్నీ యిమిడి వున్నాయన్న మాట.
 సామర్థ్యము లేదా నైపుణ్యం ,శక్తి ఉన్న వ్యక్తుల వల్ల ఏం జరుగుతుందో భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
"తెలియని కార్యమెల్ల గడతేర్చుట కొక్క వివేకి జేకొనన్/వలయునట్లైన దిద్దుకొన వచ్చు ప్రయోజన మాంధ్య మేమియుం/ గలగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్/గలిగిన జక్క జేసి కొను గాదె నరుండది చూచి భాస్కరా!"
నిపుణుడు లేదా నైపుణ్యం ఉన్న వ్యక్తి సాయము ఉన్నట్లయితే ఎంతటి దుర్లభమైన పనియైనను పూర్తి చేయవచ్చు.అదెలా అంటే అద్దంలో చూస్తూ బొట్టును చక్కగా దిద్దుకొనవచ్చు కదా! అంటారు.
అనగా అద్దం చేతిలో వుంటే బొట్టును చక్కగా ఎలా పెట్టుకోగలమో, సామర్థ్యం గల వ్యక్తులు తోడుగా, సాయంగా వుంటే పనులను కూడా అదే విధంగా ఎక్కడా యిబ్బంది పడకుండా చేయగలమన్న మాట.
ఆ  విధంగా శ్రమ లేదా శక్తి వృథా కాకుండా అంతిమ లక్ష్యాన్ని  అలవోకగా సాధించగలగడమే సామర్థ్యం.అంటే ఒక పనిని సంతృప్తికరంగా లేదా ఆశించిన స్థాయిలో నిర్వహించగలగడం.
ఈ విధంగా ఒక వ్యక్తి  యొక్క మానసిక,శారీరక యోగ్యత, సామర్థ్యాన్ని బట్టి, చేసే పనులలో జయాపజయాలు, అనుకున్న సమయానికి పూర్తి చేయడం,చేసిన వాటిలో నాణ్యత, గుణాత్మకతతో కూడిన ఫలితాలు ఉంటాయనేది ఈ "సామర్థ్య యోగ న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
ఐతే  మనలోని సామర్థ్యాన్ని సరైన సమయంలో సరైన రీతిలో ప్రదర్శించినప్పుడే మనమంటే ఏమిటో మన చుట్టూ ఉన్న వారికీ సమాజానికి అర్థం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు