సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -321
సాధు మైత్రి న్యాయము
*****
సాధుః అంటే అంటే మంచివాడు. మైత్రి అంటే  మిత్ర భావము, సహవాసము, స్నేహము,మిత్ర కర్మము, అనురాధా నక్షత్రము అనే అర్థాలు ఉన్నాయి.
 సాధు మైత్రి అంటే  సజ్జనులతో, మంచివారితో సహవాసము అని అర్థం.
మైత్రిలో మై అనగా నేను.త్రి అనగా మూడు.అనగా త్రికరణ శుద్ధి కలిగి వుండాలి. మనసులోనిది మాట రూపంలో చెప్పాలి. అలా చెప్పిందే చేతల్లో చూపాలి అంటే చేయాలి. ఇదే త్రికరణ శుద్ధి.మైత్రిలో  నేను అనేది త్రిమూర్తి స్వరూపం. నీవు దైవ స్వరూపం.ఇలా ఒకరితో ఒకరు కలిసి దైవత్వ లక్షణాలను అభివృద్ధి  చేసుకునేలా మైత్రి వుండాలి .
మంచి వారితో సహవాసము  చిరకాలం నిలుస్తుంది. పచ్చని చెట్టు వలె దినదినమభివృద్థి చెందుతుంది.
స్నేహం ఎంతో అద్భుతమైనది.జీవితానికి వెలుగు, వెన్నెల ఇచ్చేది స్నేహం.మంచి మిత్రులకు మించిన ఆస్తిపాస్తులు ఏవీ లేవు. స్నేహానికి ఉన్న గొప్ప గుణం ఎప్పుడూ ఇవ్వడమే కానీ ప్రతిఫలాన్ని ఆశించదు.
ఈ స్నేహ బంధం మొగ్గలా మొదలై మహావృక్షమంత ఎదగాలి.అప్పుడే ఆ స్నేహపు నీడ జీవితాంతం తోడై సేద తీరుస్తుంది.
అందుకే పెద్దలు" చెడును వందిచ్చి వదిలించుకోవాలి. మంచిని మాటలతో గెలుచుకోవాలి" అంటారు.స్నేహం అంటే వ్యక్తుల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధం.ఈ బంధం జీవితానికో మంచి దారి చూపాలి, బతుకును ఉద్ధరించాలి కానీ పాడు చేయకూడదు. పాడు చేసే స్నేహం  స్నేహమే కాదు.కాబట్టి మంచి స్నేహమే చేయాలి.
అభిజ్ఞాన శాకుంతలం రాసిన మహా కవి కాళిదాసు ఏమంటారంటే... " సతాం సబ్డి హిసంగః కదమపి హి పుణ్యేన భవతి"  అంటే మంచివారితో సహవాసము చేయడమనేది గత జన్మల  పుణ్యం చేత మాత్రమే జరుగుతుంది" అంటారు‌. మరలాంటి మంచి స్నేహం దొరికిన వ్యక్తులు ఎంతో అదృష్టవంతులు కదా!.
మంచి స్నేహం వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడితే, చెడు స్నేహం పతనానికి దారి తీస్తుంది.మంచి వారి మైత్రి  పాత బడిన కొద్దీ  బంగారంలా ఎంతో బాగుంటుంది*
మంచి , చెడుల మైత్రికి సంబంధించిన ఓ శ్లోకాన్ని చూద్దామా...
"ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ/లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్/దినస్య పూర్వార్థ పరార్థ భిన్నా/ఛాయేవ మైత్రీ ఖల సజ్ఝనానామ్!!"
అంటే చెడ్డ వారితో స్నేహము రోజులోని ప్రథమార్థంలో గల నీడలా ముందు ఎంతో ఎక్కువగా వుండి కాల గమనంతో తగ్గి పోతుంది. అదే మంచి వారితో స్నేహమైతే రోజులోని మధ్యాహ్నము నందు నీడ వలె ముందు చాలా చిన్నగా వుండి క్రమేణా కాలం గడిచే కొద్దీ వృద్ధి చెందుతుంది.
స్నేహంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే పేద గొప్ప పండిత,పామర భేదం ఉండదు.రామాయణంలో సుగ్రీవుడు రాముడి స్నేహం వల్ల ఇరువురికీ మేలు జరిగింది.
అలాగే  కృష్ణ కుచేల మైత్రి వల్ల కుచేలునికి ఎంత మేలు జరిగిందో చదువుకున్నాం.ఇక మహాభారతంలో దుర్యోధనుడితో స్నేహం వల్ల కర్ణుడు ఎన్ని అపవాదుల పాలయ్యాడో మనకు తెలుసు.
కాబట్టి మంచి వారి స్నేహమే మనిషికి శ్రీరామ రక్ష. ఓ వ్యక్తికి ఉన్న స్నేహితులను చూసి ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఠకీమని చెప్పగలం.
మరి ఈ పద్యం ద్వారా ఎలాంటి స్నేహం చేయాలో తెలుసుకుందాం.
"నీటి మీది రాత నిజము దుర్జన మైత్రి/చేయుచుండగనె నశించుచుండు/అదియె సజ్జనాళి యందు జల్పితి మేని/ రాత గీచి నట్టి గీత గాదె?"
చెడ్డ వారితో చేసే స్నేహం నీటి మీది రాత వంటిది.అలాంటి స్నేహం చేస్తుంటేనే చెరిగిపోతుంది.అదే స్నేహం మంచి వారితో చేస్తే రాతి మీద చెక్కిన గీతలా శాశ్వతంగా ఉంటుంది.ఎన్నటికీ చెరోగిపోదు.
ఇలా చెప్పుకుంటూ పోతే  "సాధు మైత్రి న్యాయం" గురించి ఎన్నో పద్యాలు, పాటలు, శ్లోకాలు ఉన్నాయి.ఇలా స్నేహం గురించి పేజీలకు పేజీలు తడుముకోకుండా , చెప్పగలరు. రాయగలరు.
 స్నేహమేరా జీవితం - స్నేహమేరా శాశ్వతం అని పాడుకుంటూ మనల్ని  ముంచే వారితో కాకుండా మంచి వారితో స్నేహం చేద్దాం. "స్నేహానికన్న మిన్న లోకాన లేదురా " అని ఋజువు చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు