శాంతి సామరస్యాలు ;- సి.హెచ్.ప్రతాప్
 ప్రతి ఒక్కరూ శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటారు, ఎప్పటికప్పుడు మనమందరం ఆందోళనను, చికాకుని, సామరస్యం లేకపోవటాన్నీ అనుభవిస్తూ ఉంటాము. అలా వీటితో బాధపడుతూ ఉన్నప్పుడు, మనం వాటిని మనవరకే పరిమితం చేసుకోకుండా, తరచూ ఇతరులకు కుడా వాటిని పంచుతుంటాము. తద్వారా ఆ బాధ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి విస్తరిస్తుంది, మన పరిచయంలోకి వచ్చిన వారందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. భగవంతుడు మనల్ని సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో జీవించమని పంపిస్తే మనం మన అవివేకపూరిత మనస్తత్వంతో వాటిని దూరం చేసుకుంటూ ఆందోళనలు, అశాంతితో జీవించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. మన కష్టాల నుండి ఉపశమనం పొందటానికి, దానికి మూల కారణం - దుఃఖానికి కారణం తెలుసుకోవాలి. మనం సమస్యను లోతుగా పరిశీలిస్తే , మన మనసులో ప్రతికూల భావన లేదా కల్మషం జనింపచేసుకున్న ప్రతిసారి మనం దు:ఖితులమవుతామని స్పష్టం అవుతుంది. మనసులో వికారాలు, మానసిక అపవిత్రత లేదా కల్మషం ఉన్నప్పుడు, శాంతి, సామరస్యాలు ఉండలేవు.కాబట్టి ముందుగా మనలో వ్యతిరేక భావాలను తొలగించుకోవడం తక్షణ కర్తవ్యం.
 దైవం, దైవస్వరూపులైన మానవాళిని అత్యంత ఆర్ద్రతతో ప్రార్థిస్తూ, ‘ఈ ప్రపంచాన్ని భూతలస్వర్గంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే, దానికి ఈ భూమిపై ఉండే ప్రతిఒక్కరమూ సమర్థులమే, అందుచేత మనమంతా బృందంగా ఏర్పడి ఓ వసుధైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం, అందరూ సిద్ధం కండి’ అనే అంతస్సూత్రంతో సమస్త మానవాళికి విశ్వకవి ఇచ్చిన శాంతి మంత్రమే అందరికీ సదా స్పూర్తి కావాలి. మన వేదాలలో శాంతి సామరస్యాలు గురించి బహు విలువైన వాక్యాలు వున్నాయి.
స్వర్గంలో శాంతి, వాతావరణంలో శాంతి, భూమిపై శాంతి ఉండుగాక. నీటిలో చల్లదనం, మూలికలలో వైద్యం మరియు చెట్ల నుండి ప్రసరించే శాంతి ఉండనివ్వండి. గ్రహాలలో మరియు నక్షత్రాలలో సామరస్యం మరియు శాశ్వతమైన జ్ఞానంలో పరిపూర్ణత ఉండనివ్వండి. విశ్వంలోని ప్రతిదీ శాంతిగా ఉండనివ్వండి. శాంతి ప్రతిచోటా, అన్ని సమయాలలో వ్యాపించనివ్వండి. ఆ శాంతిని నేను నా హృదయంలోనే అనుభవించగలను.(యజుర్వేదం 36.17)
ఉన్నతమైన జీవి చెడుకు చెడును అందించడు. ఇది గమనించవలసిన సూత్రం... దుర్మార్గులకు లేదా మంచివారికి లేదా మరణానికి అర్హమైన జంతువులకు కూడా హాని చేయకూడదు. ఇతరులను గాయపరచడం లేదా క్రూరమైన పనులు చేయడం ఆనందించే వారి పట్ల కూడా ఒక గొప్ప ఆత్మ కనికరం చూపుతుంది... తప్పు లేనిది ఎవరు?(వాల్మీకి రామాయణం). 
కామెంట్‌లు