పుస్తక పఠనం- సి.హెచ్.ప్రతాప్

 మనకుండే ఆసక్తి మనకు పుస్తక పఠనం వైపు మనసు వెళుతుంది. పుస్తక పఠనంలో గ్రహించేశక్తిని బట్టి విషయాలలో నైపుణ్యత పెరుగుతుంది.పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని అంశము మన మనసులో ఒక ఊహాత్మక ఆలోచనను సృష్టించగలదు. సాధన చేస్తే మనమే దృశ్యరూపం ఇచ్చే శక్తిని పొందవచ్చు.జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు గతంలో ఎవరు ఎలా ఆ కష్టాలను గట్టెక్కారో? ఒక అవగాహన పుస్తక పఠనం వలన ఏర్పడుతుంది.అసలు పుస్తకాలు చదవడం అన్నది ఒక సంస్కృతిగా మనం ప్రోత్సహించాలి. వీడియోలు చూడడం, సెల్ ఫోన్ లో ఆటలు ఆడదం కంటె  పుస్తక పఠనం మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. పుస్తకాలు మెదడుకి మంచి వ్యాయామం ఇచ్చి ఆలోచనా దృక్పధాన్ని పెంచుతాయి. ఎందరో సాధారణ మానవులు పుస్తక పఠనం ద్వారానే మహనీయులు అయ్యారని మన చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై మోజు అన్నింటినీ మించిపోతోంది, అటువంటి పరిస్థితులలో మనం మన సమాజంలో ఈ పుస్తక పఠనం అనే సంసృతిని వదిలిపెట్టకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రభుత్వం మరింత క్రియాశీలకమైన పాత్ర పోషించాలి.పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కథల పుస్తకాలు పిల్లలో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్నా చదువడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఉన్నత శిఖరాలు చేరవచ్చు. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా అన్ని తరాల వారిని అలరిస్తున్నది. ‘మంచి పుస్తకం ఓ మంచి ప్రాణస్నేహితుడి’తో సమానం అన్నది ఒక ప్రాచుర్యం పొందిన కొటేషన్. 
కామెంట్‌లు