న్యాయాలు -342
సూర్యాస్త న్యాయము
*****
సూర్య అంటే సూర్యుడు.అస్త అంటే ఆస్తమించుట, సూర్యాస్తమయము, పతనము అనే అర్థాలు ఉన్నాయి.
సూర్యుడు అస్తమించితే చీకటి ఆవరిస్తుంది. ఆవరించిన చీకటిలో అనేక దుష్ట శక్తులు అంటే అసాంఘిక కార్యకలాపాలు జరిపేవారు బయటికి వస్తారు అనే అర్థంతో ఈ "సూర్యాస్త న్యాయము" చెప్పబడింది.
ఇక్కడ సూర్యుడు ఓ రాజుకు ప్రతీకగా తీసుకోబడ్డాడు. రాజు మరణించినా లేదా అనారోగ్యం పాలైనా శత్రువులు విజృంభిస్తారు అనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
సూర్యుడిలా రాజు తన భుజ బల శక్తి సామర్థ్యాలతో ప్రకాశిస్తూ ఉన్నంత కాలం అందరూ అతడికి భయపడతారు.అడుగులకు మడుగులు ఒత్తుతారు.ఎంతో గౌరవం ఇస్తారు. చెప్పినట్లు నడుచుకుంటారు.అదే రాజులోని శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే అస్తమిస్తాయో అంటే నశించి పోతాయో అప్పుడు ఎవ్వరూ అతడిని లెక్క చేయరు. పైగా బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.అరాచకత్వం ప్రబలుతుంది.దుష్ట జనుల ఆగడం ఎక్కువవుతుంది.
దీనికి సంబంధించి భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
"బలయుతుడైన వేళ నిజ!బంధుడు తోడ్పడుగాని,యాతడే/ బలము తొలంగనేని తన పాలిట శత్రు వదెట్లు?పూర్ణుడై/జ్వాలనుడు కాన గాల్చు తఱి సఖ్యము జూపును వాయు దేవు;డా/బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పడె గాలి భాస్కరా!"
అంటే బలమున్నప్పుడు బంధువులు ఎవరైనా సాయపడతారు.అదే బలము తగ్గినప్పుడు సాయపడటం మాట అటుంచి పగ పూనడంతో పాటు శత్రువులుగా మారుతారు.అది ఎట్లా అనగా అగ్ని సంపూర్ణంగా చెలరేగి అడవిని కాల్చుతున్నప్పుడు గాలి మిత్రుడిలా తోడొచ్చి మరింత ఎక్కువగా కాలిపోయేలా చేస్తుంది. ఆ అగ్నియే తక్కువ బలము గలదై అంటే బలహీనమైన దీపంగా వున్నప్పుడు అంతకు ముందు తోడ్పడిన గాలే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది.
ఎవరైనా సరే ఒంట్లో బలం, ఇంట్లో ఆస్తి శక్తి సామర్థ్యాలు ఉన్నంత కాలమే ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆ ఆస్తి, బలం, శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినప్పుడూ ఎవరూ లెక్క చేయక పోగా దుష్ట గుణాలతో హాని చేయుటకు కూడా వెనుకాడరని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
మనం దీనిని మానవ జీవితంలోని దశలకు కూడా అన్వయించుకోవచ్చు. వ్యక్తి తన ఒంట్లో బలం ఉన్నంత కాలం.రాజాలా బతుకుతాడు ఓ వెలుగు వెలుగుతాడు. వృద్ధాప్యం అనే చీకటి ఎప్పుడైతే ఆవరిస్తుందో అప్పటి నుండి అతనిలోని వెలుగు తగ్గి అందరికీ లోకువై పోతాడు.ఇతరుల సహాయం పొందే వేళ చీదరింపులు,ఛీత్కారాలు, అవమానాలకు గురవడం మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాం.వాళ్ళను చూసి ఓ అప్పుడు ఒక వెలుగు వెలిగాడు. పాపం! ఇప్పుడు ప్చ్ !అనుకుంటూ వుంటాం.
న్యాయము చూడడానికి చిన్న వాక్యంగా వున్నా అందులో ఇంత నిగూఢమైన అర్థం దాగి ఉంది.
మన పెద్దలు జీవిత సత్యాలను ఇలాంటి న్యాయాలతో పోల్చి చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే... మానసికంగా సిద్ధపడమని, అలాగే "దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే" హెచ్చరిక కూడా కనిపిస్తుంది.
అప్పటి వరకూ ఒంట్లోని ఓపికను, ఆస్తిని అంతా త్యాగం చేసి కుటుంబ అభివృద్ధి కోసం శ్రమించిన వ్యక్తులు ఎంతో మంది జీవిత అస్తమయంలో కుటుంబం నుంచి ఎలాంటి ఆదరణ లేక దుర్భరమైన జీవితాన్ని గడపడం చూస్తున్నాం. అలాంటి వారు ఇలాంటివి చదివి కొంతైనా జాగ్రత్త వహించాలి.
ఈ "సూర్యాస్త న్యాయము" ద్వారా మనమూ శేష జీవితం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి