తిరుమలరావుకు పాఠశాల శతాబ్ధి ఉత్సవ సత్కారం

 దశుమంతపురం పాఠశాల ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పాఠశాల శతాబ్ధి ఉత్సవ వేదికపై జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. 
ఈ వందేళ్లలో దశుమంతపురం పాఠశాలలో పనిచేసి, ప్రస్తుతం వేర్వేరు చోట్ల ఉన్న ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని గౌరవసత్కారం గావించారు. ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలో 1990 నుండి 1992 వరకూ గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసిన కుదమ తిరుమలరావును సన్మానించారు.
తిరుమలరావు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తూ, తాత్కాలికంగా పనిసర్దుబాటు డెప్యుటేషన్ పై పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
తిరుమలరావు దశుమంతపురం పాఠశాలలో రెండేళ్లే పనిచేసిననూ,  
ఇరుగుపొరుగు గ్రామాలైన నడిమికెల్ల, చలివేంద్రి, నర్శిపురంగోర పాఠశాలలందు ఇరవై సంవత్సరాలపాటు పనిచేయడంతో 
ఈ గ్రామప్రజలకు మిక్కిలి సన్నిహితులైనారు.
ఈ మూడు పాఠశాలలందు పనిచేసినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి
ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై
పురస్కారాలు పొందారు.
దశుమంతపురం పాఠశాలలో పనిచేస్తుండగా తిరుమలరావు ఏకరూప దుస్తుల విధానాన్ని అమలుచేస్తూ మండలంలోనే తొలి సారిగా విద్యార్థులకు యూనిఫారం విధానానికి శ్రీకారం చుట్టారు. 
ఆనాడు పాఠశాలను సందర్శించిన 
మండల విద్యా శాఖాధికారి లింగమూర్తి, ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తిరుమలరావును ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని సభలో గుర్తుచేసుకున్నారు. 
తిరుమలరావు పనిచేసిన తొలి పాఠశాల పసుకుడిలో కూడా యూనిఫారం విధానాన్ని అమలుచేసీ, ఆ భామిని మండలంలో కూడా తొలిసారిగా శ్రీకారమొనర్చి విషయాన్ని ఈనాటి వేదికపై ప్రస్తావించారు. 1992లో అక్షరక్రాంతి పథకం ప్రవేశపెట్టగా, 
ఈ దశుమంతపురం పాఠశాల గోడలపై, గ్రామంలో గల ప్రధాన కూడళ్లలో అక్షరాస్యతకు సంబంధించిన నినాదాలను 1990లోనే తిరుమలరావు తానే స్వయంగా కుంచె చేతబట్టి రాసారని పూర్వవిద్యార్ధులు గుర్తుచేసారు. అలాగే రామమందిరంపైన కూడా తిరుమలరావు నైతిక విలువలకు సంబంధించిన పలు సూక్తులను రాసారని, పాఠశాలకు నేమ్ ప్లేట్ కూడా రాసారని గుర్తుచేస్తూ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
తిరుమలరావును వీరఘట్టం మండల విద్యా శాఖాధికారులు డి.గౌరునాయుడు, ఆర్.ఆనందరావు, దశుమంతపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వూద మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు కామర్శ శ్రీనివాసరావు, గంట ప్రసాద్, సాధుజోడ రామకృష్ణారావు, పాండ్రంకి నాగేశ్వరరావు, నులకజోడు గౌరి తదితరులు ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు