సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -334
సుభగా భిక్షు న్యాయము
****
 సుభగా అంటే సుందరి,మనోహరురాలు ,భాగ్యవంతురాలు.భిక్షు అంటే బ్రహ్మచారి, సన్యాసి, బిచ్చగాడు అని అర్థము.
ఒక సుందరి,ఒక సన్యాసి వెళ్తూ వుండగా ఒక దుర్మార్గుడు వారి వెంట పడి చంపడానికి ప్రయత్నిస్తాడు.భయంతో అతడి నుండి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ వుంటే దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు.అతడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు.
శరణన్న వారిని రక్షించడం  గొప్పదని భావించిన ఆ బాటసారి దుర్మార్గుడైన శత్రువుతో పోరాడి వారిద్దరినీ కాపాడుతాడు.
కానీ శత్రువు మహా బలవంతుడవడంతో  మళ్ళీ దాడికి వస్తాడు. అప్పటికి అతని మనసులో మార్పు వస్తుంది ఈ సారి శత్రువుతో ఎలాగూ పోరాడలేను కాబట్టి సుందరిని మాత్రం ఎలాగోలా రక్షించి  తీసుకుని పోతాను అనుకుని  ఆమెను రక్షించి తీసుకుని పారిపోతాడు.సన్యాసిని అక్కడే వదిలివేయడం వల్ల ఆ దుష్టుడి చేతిలో సన్యాసి మరణించాల్సి వస్తుంది.
ఇందులో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే  సుందరిని కాపాడిన వ్యక్తి/ బాటసారి మనిషి మనసు లాంటిదన్న మాట.కొందరి మనసు తనకు ఇష్టమైన దాని కోసం ఎంతైనా ప్రయత్నిస్తుంది.ఎంతకైనా తెగిస్తుంది.అంతే కానీ ధర్మాధర్మాల గురించి ఆలోచించదు.
అందుకే బాటసారి మనసుకు సన్యాసి కంటే కూడా సుందరిని కాపాడటమే ముఖ్యం అనిపించింది.
మామూలు దృష్టితో చూస్తే ఆమె అబల కదా!  ఆ బాటసారి మంచి నిర్ణయమే తీసుకున్నాడు అనిపిస్తుంది.
 ఎవరికైనా.కానీ ఇక్కడ సుందరి అనే వ్యక్తి తనకు ఇష్టమైనది అంటే  స్వలాభం అన్న మాట.అంటే మనిషి  తనకు ఇష్టమైన దానిని పొందడం కోసం, స్వలాభం కోసం అలా  చేసాడు.
బాటసారికి సన్యాసి కంటే సుందరి మీద ఎక్కువ ఇష్టం వుండటం చేత సన్యాసిని అక్కడ వదిలేస్తే చంపబడతాడు అని తెలిసి కూడా వదిలేశాడు.అలా కాకుండా ఆ బాటసారి తన జీవితాన్ని త్యాగించి వారిద్దరినీ రక్షిస్తే అతడు స్వార్థానికి అతీతుడుగా గుర్తింపబడే వాడు.
మనుషుల్లో చాలా మంది ఇలాంటి స్వార్థపరులు వుంటారనీ, అలాంటి వారు తమ సుఖం ఆనందం కోసం  ధర్మాధర్మాలను పక్కన పెట్టి ఎంతటికైనా తెగిస్తారని  ఈ" సుభగా భిక్షు న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.
 కానీ అలా చేయడం మంచిదా? కాదా? మన అంతరాత్మను అడిగితే ఏం సమాధానం చెబుతుంది?. పరోపకారం,వీరత్వం, త్యాగం గొప్పవి కానీ, ఇలా స్వార్థం మంచిది కాదనే అంటుంది కదా!.
 మన అంతరాత్మ అసలు సిసలైన న్యాయవాది.తప్పేదో ఒప్పెదో చెప్పి నిలదీస్తుంది.ఏదైనా సరే నిష్పక్షపాతముగా చెబుతుంది.కాబట్టి ఈ చిన్న  జీవితాన్ని అంతరాత్మ  చెప్పినట్లుగా నిస్వార్థంగా గడుపుదాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుల త్యాగాన్ని  గుర్తు తెచ్చుకుని ఆ బాటలో  నడిచేందుకు ప్రయత్నిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు