సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -353
స్వదీప చుంబన న్యాయము
******
స్వ అంటే తాను, ధనము, తనది. దీపము అంటే ప్రకాశము,వెలుగు మయూరి శిఖి అనే అర్థాలు కలవు.చుంబనము అంటే  ముద్దు.
స్వంత దీపమే కదా అని ముద్దు పెట్టుకోవడమన్న మాట .
"మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు తెగ కాలినట్లు" అనే సామెతకు ఇది సరిగా సరిపోతుంది. దీపానికి వెలుగుతో పాటు వేడి, దగ్గరకు వెళ్తే కాల్చే గుణం కూడా ఉంటుంది.
అందుకే ఓ కవి అంటాడు "మునుకొని యింటి దీపమని ముద్దిడ మీసలు గాల కుండునే?" అని.
ఇక్కడ ఇంటి దీపం అంటే మన కంటి వెలుగు అయిన పిల్లల్ని అతి గారాబం చేస్తే చివరికి మనకే కష్టం, నష్టం కలుగుతుందనీ,అలాగే నా స్వంత వాళ్ళు ,నా వాళ్ళు  అని వెనకేసుకు రావడం వల్ల ఎదురయ్యే యిబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కొందరు తమ పిల్లల తప్పులను, తమకు బాగా దగ్గరైన వారి తప్పులను సరిదిద్దకుండా,సవరించకుండా చూసీ చూడనట్లు వుంటారు.పైగా కొంతమంది అలా తప్పు చేసిన వారిని సమర్ధిస్తూ వుంటారు,తమ వాళ్ళే కదాని చూపించే ఇలాంటి  వైఖరి చివరికి   చేదు అనుభవాలు, ఫలితాల్ని పొందే పరిస్థితి తీసుకుని వస్తుంది. తత్ఫలితంగా  అనేక యిబ్బందులు పడిన వారు మన చుట్టూ ఉన్న సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తూ వుంటారు.
ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. తమ వారసులుగా ఎలాంటి పరిజ్ఞానం లేని వారిని, సందర్భోచితంగా మాట్లాడటం రాని వారిని ప్రకటించి వారి వల్ల తమకు అప్పటి వరకు ఉన్న మంచి పేరు పోగొట్టుకున్న  వారు చాలా మంది ఉన్నారు.
దీనికి దగ్గరగా ఉన్న ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా...
శూరసేనుడు అనే రాజు ఉండేవాడు.అతడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా ఎవరికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునే వాడు.అలా అతని రాజ్యంలో ప్రజలే కాకుండా పశుపక్ష్యాదులు కూడా  ఎలాంటి యిబ్బందులు లేకుండా ఆనందంగా జీవించేవి.
అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు రాజుగారు ఉద్యానవనంలో విహరిస్తూ వుండగా కొన్ని చెట్లకున్న గొంగళి పురుగులను చూస్తాడు.వాటిని  ఎంతో ఆసక్తిగా చూడటం మొదలు పెడతాడు.అలా అవి గూడు కట్టుకోవడం చూశాడు.కొన్నాళ్ళకు అందులోంచి సీతాకోకచిలుకలు బయటికి వచ్చి చటుక్కున ఎగిరిపోవడం ఆశ్చర్యంగా అనిపించేది. ఎలాగైనా ఆ గూడు లోంచి బయటికి ఎలా వస్తాయో, సీతాకోక చిలుక పుట్టుక ఎలా జరుగుతుందో చూడటం మాత్రం సాధ్యపడేది కాదు.
తన మంత్రికి మనసులో ఉన్న కోరికను చెబుతాడు.మంత్రి వెంటనే గొంగళి పురుగులు ఉన్న చెట్టు దగ్గర కొందరు భటులను నియమించి సీతాకోక చిలుక పుట్టుక సమయాన్ని వెంటనే తెలియజేయవలసిందిగా ఆదేశిస్తాడు.
భటులు కళ్ళలో వత్తులు వేసుకుని వాటిని ప్రతి క్షణం గమనిస్తూ వుంటారు.అలా ఓరోజు సీతాకోకచిలుక పుట్టే సమయం ఆసన్నమైందని గ్రహించి మంత్రిగారికి చెబుతారు.
వెంటనే మంత్రి రాజుగారిని తీసుకుని ఉద్యానవనానికి వస్తాడు.రాజు ఎంతో ఆసక్తిగా గమనించడం మొదలు పెడతాడు.గూడులోంచి సీతాకోక చిలుక మెల్ల మెల్లగా బయటికి రావడం చూసి, "పాపం! సీతాకోకచిలుక బయటికి రావడానికి ఎంత  కష్టపడుతుందో కదాని, ఆ గూడును ఓ చిన్న చాకు సాయంతో కత్తిరిస్తాడు. సీతాకోకచిలుక బయటికి వస్తుంది కానీ ఎగరలేక గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి రాజు గారు "అయ్యో! ఇది ఎగరలేక పోతుందే!" అనుకుంటూ దానిని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు. కానీ అది ఎగరలేక కింద పడిపోతుంది.ఎగరడానికి రెక్కలు విచ్చుకోవు. అలా చాలా సేపు ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక గిలగిలా తన్నుకొని చచ్చిపోతుంది.
 ఆ దృశ్యం చూసి మహా రాజు బాగా దుఃఖిస్తూ.... మంత్రివర్యా!ఎందుకిలా జరిగింది?ఆ సీతాకోక చిలుక ఎందుకలా చనిపోయింది? అని అడుగుతాడు.
మహారాజా! సృష్టిలో ప్రతి ప్రాణి తనకు తానే ఎదగడానికి ప్రయత్నిస్తుంది.అలా ప్రయత్నించాలి కూడా.అప్పుడే వాటి శక్తి సామర్థ్యాలు వాటికి తెలుస్తాయి. ఈ విషయం ఒక్క పశుపక్ష్యాదులకే కాదు మానవులకు కూడా వర్తిస్తుంది.
మనం మన పిల్లలకు అన్నీ  సమకూర్చుతూ వారిని  స్వంతంగా ఆలోచించకుండా , వారేం చేసినా ముద్దు చేయడం, వెనకేసుకుని రావడం,అతి గారాబం చేయడం వల్ల వాళ్ళలో క్రమశిక్షణా రాహిత్యం, ఆలోచనా రాహిత్యం పెరుగుతుంది.వాళ్ళలోని శక్తి సామర్థ్యాలు అడుగంటి సరైన ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది.కాబట్టి స్వయంగా తనకు తానుగా ఎదిగేలా చేయాలి.మీరు ఇక్కడ సీతాకోకచిలుక బయటికి రావడానికి కష్టపడకూడదనే ఉద్దేశ్యంతో సహాయం చేద్దామని అనుకున్నారు.కానీ అదే తన జీవితాన్ని బలి తీసుకుంది. "ఇదిగో చూడండి! ఈ గూడులోంచి సీతాకోక చిలుక ఎలా తన చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని బయటికి వచ్చి రివ్వున ఎగిరి పోతోందో! అలా బయటికి వచ్చేముందు అది చేసిన పోరాటం చూశారు కదా! అలా పోరాడటం లోనే దాని లోని శక్తి సామర్థ్యాలు బయట పడ్డాయి.ఇలా  తమ స్వయం శక్తితో బయట పడేందుకు చేసే ప్రయత్నం వల్ల దానిలోని మానసిక బలమెంతో తెలుస్తుంది".
అలా "నా సంతానం,నా వాళ్ళు అని వాళ్ళను గారాబం చేయడమో లేదా చేసిన తప్పులను సరిదిద్దకుండా సమర్థించడమో చేయడమనేది "స్వదీప చుంబన న్యాయము" లాంటిదని  గ్రహించాలి.
అలాంటివి చేసి మన వాళ్ళను మనమే చెడగొట్టుకోకూడదు.ఆ తర్వాత బాధ పడకూడదు.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు