తలకాయ!!;- ప్రతాప్ కౌటిళ్యా
కాలిపోయినవీ కూలిపోయినవీ కాక
వెలిగే నక్షత్రాలను లెక్కిస్తున్నాను!!

నిన్న మొన్న ఈరోజు రేపు కూడా
లెక్కిస్తూనే ఉంటాను
లెక్క తేలుతుందంటారా
గుర్తుంచుకుంటారా గుర్తుపడతారా!!?

ఆకాశం గురించి అవకాశం గురించి
ఊహించుకుంటారా
అసలు ఉంటారా మీరు ఇక్కడే!!!?

తోక వదిలేసి లేచి నిలబడే కాళ్లు
తొండ మొదిలేసి చాచి పట్టుకునే చేతులు
విచిత్రంగా మలిచాయి
చిత్రంగా కదిలే కళ్ళు వినే చెవులు సరిపోవా
మెరిసే నక్షత్రాలను లెక్కించడానికి!!?

సరిపోలేదేమో పాపం
మొండంపై తల ఒకటి తగిలించుకొని
తడబడకుండా ఎక్కాలు లెక్కలు వల్లిస్తూ
మురిసిపోయే ముఖాలు కొన్ని
ఇప్పుడు మళ్లీ మళ్లీ
మెరిసే నక్షత్రాలను లెక్కిస్తున్నాయి!!?

ఎగిరిపోయే పక్షికి తెలుసు
నీటిలో నీ మొసలికి తెలుసు
ఎడారిలోని చెట్టుకు తెలుసు నీ సంగతి!!

నీవు ఈదే సముద్రం తిమింగలానిది
నీవు ఎగిరే ఆకాశం గురుత్వాకర్షణదీ
నీవు పీల్చే గాలి భూమి ఆకర్షనదీ
నీవు తాగే నీరు ఆపినది భూమి ఆకర్షణ
నీ భూమిని ఆపినది నిన్ను కాపాడినది
నిప్పుల కొలిమి నీ సూర్యుడు ఒక్కడే
నీకు దిక్కు!!

లెక్కలేని పాలపుంతల్లో
గెలాక్సీ లలో నక్షత్రాలను లెక్కిస్తున్నావా
నీ తల మళ్లీ మొలకముందే
తెల్లారిపోతుంది!!!

ఇది కల కాదు నిజమని తలుచుకుంటేనే
నీ గుండె ఆగిపోతుంది!!

మొండెంపై తల మొలిచింది
మెరిసే నక్షత్రాలను లెక్కించడానికి కాదు

రేపటికి
నీ తలను కాపాడుకో
నీ తలకాయ భూమి!!
ముందు భూమిని కాపాడుకో!!!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏 పాలెం

కామెంట్‌లు