ఆకాశపాఠాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనహరం
కొంతమంది
పిండివెన్నెలను దోచుకొని
ముఖాలకు పులుముకొని
చంద్రముఖులవుతున్నారు

కొంతమంది 
తారకలను పట్టుకొనితెచ్చి
వాకిటముంగిట ముగ్గుల్లోపెట్టి
ఆనందాలలో తేలిపోతున్నారు

కొంతమంది
ఆకాశనీలిరంగుబట్టను తెచ్చుకొని
వస్త్రాలుగా కుట్టించుకొని ధరించి
వయ్యారాలను ఒలకపోస్తున్నారు

కొంతమంది
ఆలోచనలను సారించి
పక్షులరెక్కలను కట్టుకొని
ఆకసంలో విహరిస్తున్నారు

కొంతమంది
మనోశక్తితో ఆకాశానికెగిరి
మేఘాలపై స్వారిచేసి
సంతోషాలలో తేలిపోతున్నారు

కొంతమంది
రవికిరణాలను పట్టుకొని
అఙ్ఞానాంధకారాలను తొలగించుకొని 
విఙ్ఞానవంతులై కవనలోకంలో వెలిగిపోతున్నారు

కొంతమంది
హరివిల్లుదగ్గరకెళ్ళి రంగులుతెచ్చి
పూదోటలలోని పువ్వులకద్ది
చక్కనైన కవితాసుమాలనుసృష్టిస్తున్నారు

కొంతమంది
అందాలనింగినిచూచి భావోద్వేగంపొంది
కాగితాలుతీసుకొని కలమునుపట్టి
కమ్మనికవితలను కూర్చుతున్నారు


కామెంట్‌లు