భోగి పండుగ ప్రాముఖ్యత- సి.హెచ్.ప్రతాప్

 సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు.తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ 'సంక్రాంతి. కటిక పేదవారు కూడా కడు ఆనందోత్సాహాలతో జరుపుకునే స్వచ్చమైన తెలుగు పండుగ సంక్రాంతి అంటే అతిశయోక్తి కాదేమో.భగ' అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు.ఉన్న కీడంతా తొలగిపోయి.. మంచిరోజులు రావాలని, అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు. అదేరోజు, బొమ్మలపేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు. ముత్తైదువులనూ పిలిచి పేరంటం చేసి, పండూ తాంబూలం ఇస్తారు.
దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల (బొంఫిరె) రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు. అందరూ భోగి రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవుపేడతో తయారైన పిడకలు, ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేస్తారు. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. . ఇందులో పాత చెక్కతోపాటు ఇంట్లో ఉండే పాత సామాగ్రిని వేస్తారు. భోగి మంటల చుట్టూ చేరి ఆటలు, పాటల కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తర్వాత భోగి మంటలపై పాత్రలను ఉంచి అందులో నీటి వేడి చేస్తారు. ఈ వేడినీటితోనే స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. భోగి అనగానే చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోస్తారు. సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండటం వల్లే దీనికి ఆర్కఫలం అని పేరు వచ్చింది. సూర్యుడి ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు.నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.రేగుపళ్లు సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.  జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం.మన పూర్వీకులు 'భోగి' రోజున ఇంటి దేవతలను పూజించేవారు. అందుకే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున  కులదేవత ఆలయానికి వెళ్లి పూజలు చేయడం మర్చిపోకూడదని పెద్దలు చెబుతున్నారు. దీనివల్ల  అంతా మంచే జరుగుతుంది. భోగి పండుగ రోజున ఆడవారు, మగవారు మాంసాన్ని అస్సలు తినకూడదు. అదేవిధంగా పురుషులు మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.. భోగి రోజున నిద్రిస్తే ఇంటి దైవానికి కోపం వస్తుందని చెబుతారు.పరిశుభ్రతను పాటించడానికి భోగి మంటల్లో కేవలం కట్టెలను మాత్రమే వేయాలి. దీంతో గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉండదు. కానీ టైర్లు, రబ్బరు, ప్లాస్టిక్ లు, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేసే పదార్థాలను కాల్చడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.
కామెంట్‌లు