సంబరాల సంక్రాంతి;- సి.హెచ్.ప్రతాప్

  తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో మొదటి రోజును భోగి పండుగగా రెందవరోజు సంక్రాంతిగా, మూదవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు.గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గుల లోగిళ్లు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, పిండి వంటలు, పతంగులు, భోగిమంటల సంబురం సంక్రాంతి.సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజింపబడుతోంది. కటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు దక్షిణాయనంగా, మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకు ఉత్తరాయణంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం దేవతా పూజకు, దక్షిణాయనం పితృదేవతారాధనకు ప్రధానం.సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు. కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు చేరుకుంటాయి. ఇంటింటా ఆనందపు చాయలు వెల్లి విరుస్తాయి.గృహిణులు, యువతులు ముగ్గులు వేయడానికి పోటీపడతారు. ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు ప్రత్యేకం. గొబ్బెమ్మలను పేడతో తయారు చేసి వాటిని పసుపు, కుంకుమ, గరిక, పిండి పూతలతో అలంకరిస్తారు. ముగ్గుల మధ్య ఉంచి పువ్వులు, నవ ధాన్యాలు,రేగు పండ్లను వేస్తారు. ఇలా పండుగలు చేసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. అంతా కలిసిమెలిసి వుండడం అలవడుతుంది. పక్క వారికి సహాయం చేయా లనేది తెలుస్తుంది. అదే పల్లెలో గొప్ప తనం.సంక్రాంతి పండగ రోజు చేసే పిండివంటన్నీంటిలోనూ నువ్వులు ఉపయోగిస్తారు.హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు, ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు. వీళ్లందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు.మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు.ఎవరితో విభేదాలున్న అంతా కలిసి ఉండాలని.. అందరూ కలిసి మెలగాలని సూచిస్తూ ఈ పండుగలను హిందువులు చాలా నమ్మకంగా చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు ఎవరైనా సరే మరణించారంటే కచ్చితంగా వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్లిపోతారని శాస్త్రవాక్యం.భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం కనిపిస్తుంది. మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినాలలో విష్ణు మూర్తిని ఆరాధిస్తాం.సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి.. సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది.
కామెంట్‌లు