*సంక్రాంతి తోరణాలు*;- ఉండ్రాళ్ళ రాజేశం
 చెంబు చేతబట్టి దెబ్బలు వేయుచూ
గారెలన్ని వొత్తి కాల్చుకుంటు
చెయ్యి చుట్టుతిప్పు చిత్రాల సకినాలు
కాగు నింపినాము కష్టపడుతు
పూసబిళ్ళ తీసి బుచ్చి చెగోడిలు
వాయివాయికేసి వరుసపేర్చి
మాట ముచ్చటాడి మాటిమటికి తింటూ
పరుగులెన్నొ పెట్టు పర్వమిదియె
సక్కగాను జేసి సకినాలు గారేలు
తట్టలందు నింపి దాచినాము
ఎప్పుడొకతి తీసి యేడాది తింటిమి
భావిపౌరులార బాలలార
చుక్కలన్ని కలిపి సుందరముగ నిల్చి
రథముముగ్గు వేయ రణము జేయు
అలుపు సొలుపు లేని యందాల మగువలు
యింటినందు నిల్చి యింతులైరి
ముగ్గులెన్నొ వేసి ముంగిల్లు నింపుచు 
రంగు లద్దగలరు రాట్నమల్లె
బోగిమంట కాసి బోగాలు పొందిరి
భావిపౌరులార బాలలార


గోవుపేడ తెచ్చి గొబ్బెమ్మలను జేసి
గడపపైన బెట్టి గరకపేర్చి
ధాన్యరాశి తోడ ధరణిని పూజింత్రు
భావిపౌరులార బాలలార

అంబరాన నిలుచు హరిదాసు కీర్తన
కోడిపందెమాట కోట్లరాసి
సంబురాలు పంచు సంక్రాంతి పండుగ
పల్లెలందు తెలుగు పసిడి వెలుగు
అందమైన పిలుపు హరిదాసు కీర్తన
గంగిరెద్దు లాట గనముగాను
సంబురాలు నింపు సంక్రాంతి పండుగ
భావిపౌరులార బాలలార
గంగిరెద్దులాట గల్లిలన్ని తిరగు
గాలిపటము వేట కదులుకుంటు
యడుగులేసి పట్టి నలరించు బాలలు
బోగిమంట శుభము బొందినారు

మకరకాంతి నొంద మహినందు స్వాములు
శబరి జేరినారు జాతరగను
గగన దివ్వెజూసి గణముగా అయ్యప్ప
మాల విడిచుచుండు మాన్యులంత


గాలిపటము వదిలి గాలిలో తేలాడి
ప్రేమలేఖ పంపి పిలిచి యరిచి
పోటిలెన్నొ పడుచు నురుకుచు వుంటిమి
భావిపౌరులార బాలలారకామెంట్‌లు