మాయలోకంలో మాయమనుషులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మలినమైన
మేనును
మంచిదుస్తులు ధరించి
దాచుకుంటున్నారు మాయమనుషులు

దుర్గంధభరితమైన
పరిసరాలందు సుగంధాలుచల్లుకొని
మనసులుమూసుకొని 
కాలంగడుపుతున్నారు మాయమనుషులు

తలలోపుట్టిన
దురాలోచనలను
టోపీలుపెట్టుకొని
కప్పేసుకుంటున్నారు మాయమనుషులు

కళ్ళలోని
దొంగచూపులను
కనిపించనీయక
మోమునుమాటుచేసుకుంటున్నారు మాయమనుషులు

నిజరూపాలను
కనపడకుండా
అలంకరించుకొని
నాటకాలాడుతున్నారు మాయమనుషులు

ఇంటిరహస్యాలను
నలుగురికితెలియకుండా
తలుపులుకిటికీలు వేసుకొని
బయటకు పొక్కనీయకున్నారు మాయమనుషులు

మనసులోని
దురాలోచనలను
దాచిపెట్టుకొని
సుమతులుగా చలామణవుతున్నారు మాయమనుషులు

అవినీతిపనులను
అందరిదృష్టికిరాకుండా
చెడుచేష్టలను
చీకటిలో చేస్తున్నారు మాయమనుషులు

ముసుకేసుకొని
మోసాలకొడిగట్టి
మంచివారిలాగా
మెలగుచున్నారు మాయమనుషులు

చెప్పింది చేయక
చేసింది చెప్పక 
చాటుమాటు వ్యవహారాలకు 
పాల్పడుతున్నారు మాయమనుషులు 

మాయలోకాన్ని
చూడు
కనిపెట్టి
నడు

మాయమనుషులను
తెలుసుకో
మోసపోకుండా
మసలుకో


కామెంట్‌లు