సద్గురువు అనుగ్రహం; - సి.హెచ్.ప్రతాప్
 గురు వు అంటే నిర్గుణ పరబ్రహ్మతో సమానం అని శాస్త్రవచనం. జ్ఞాన స్వరూపుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అనుగ్రహం అందరికీ కావాలి. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు. తల్లిదండ్రుల తరువాత గు రువునే పూజిస్తారు. ఆ తరువాతే దేవుడిని కొలుస్తారు. సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గురువును గౌరవిస్తారు. గురువు లేనిదే జగత్తు లేదన్న ది అక్షర సత్యం  ఆధ్యాత్మిక జీవితములో  సంపూర్ణ విజయం సాధించుటకు మహిమాన్వితుడైన సద్గురువు ఆవశ్యకత మెండు. గురువు తన మహత్త్వం చేతా, అనుగ్రహం చేత మనకు జ్ఞానమును దానం చేస్తాడు. గురువు సంప్రదాయానికి అతీతుడు. ఈ మానవ జన్మఎంతో ఉత్తమమైనది అట్టి జన్మను మనం సార్థకం చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. మనం బతకడానికి జీవనోపాధి, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి ఇల్లు ఎంత ముఖ్యమో, ఆదర్శప్రాయమైన జీవితానికి గురువు అంత ముఖ్యం.

సద్గురువు పరిపూర్ణ కరుణా కటాక్షముల వల్లనే ,అన్ని సిద్ధుల కంటే సద్గురువు అనుగ్రహము  బహు శక్తి వంతం. సమస్త వేద,శాస్త్ర, పురాణేతిహాసాలను పఠించిననూ, యమ నియమాదులతో  అష్టాంగ యోగం చేసిననూ, సద్గురువు అనుగ్రహం  ముందు నిలువజాలవు. పామరులను పండితులుగా , భిక్షగాడిని కోటీశ్వరునిగా , జీవితాలను క్షణములలో  సంస్కరించి ఆనందమయం చేయగలిగేది కేవలం సద్గురువు అనుగ్రహము మాత్రమే. సద్గురువు యొక్క అనుగ్రహ స్పర్శ లేకుండా భగవంతుని దృష్టి యొక్క ఉన్నత స్థితి కూడా నిజమైన సాక్షాత్కారానికి ఫలించదని గమనించవచ్చు.
సద్గురువు అనుగ్రహం వుంటే క్షణాలలో ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. సద్గురువు అనుగ్రహమే లేకపోతే జన్మ జన్మల నుండి కఠోర నియమాలతో, పవిత్ర నడవడికతో, తీవ్రమైన సాధన చేసినా ఆత్మజ్ఞానం ప్రాప్తి అసాధ్యం. సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే అనేక జన్మల నుండి వస్తున్న పాపపు మూటలను తొలగించి ముక్తి ప్రసాదించగల ఒక గొప్ప సాధనం.గురువును త్రికరణశుద్ధిగా మనసా,వాచా,కర్మణ నమ్మి సేవించగలిగే పరిపాకం ఈ రోజుల్లో సాధకులకు లేకపోవడం వలనే శిష్యులకు పరిపూర్ణ కటాక్షం లభించడం లేదు.

కామెంట్‌లు