సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -372
అజగర న్యాయము
*****
అజగర అంటే కొండ చిలువ,పెను బాము.
కొండ చిలువ చుట్టలు చుట్టలుగా ఒక చోట కదలక మెదలక నిద్రపోతున్నట్లుగా  పడుకుంటుంది. అటుగా తన  సమీపంలోకి వచ్చిన జంతువును ఆకస్మికంగా పట్టి మింగేస్తుంది.
అలా ఏమీ ఎరుగనట్లు, నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ,సమయం అవకాశం రాగానే తన అవసరం తీర్చుకునే లేదా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని వ్యక్తులను ఉద్దేశించి ఈ "అజగర న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇలాంటి వారు చాలా ప్రమాదకరమైన వారు. వారి దగ్గరకు వెళ్ళిన తరువాత వాళ్ళేంటో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం, ప్రమాదం జరిగిపోతుంది. ఆ తర్వాత చేసేందుకు ఏమీ ఉండదు.
ఎలాగూ  అజగరము అనేది ఈ న్యాయములో వచ్చింది కాబట్టి అజగరునికి  సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ మహాభారతంలోని  అరణ్య పర్వములో వుంది.దానిని తెలుసుకుందాం.
 ఒకరోజు భీముడు హిమాలయ పర్వతాల మీదున్న అడవుల్లోకి వేటకు  వెళ్ళాడు.అక్కడ ఓ అజగరము అనగా కొండచిలువ భీముణ్ణి తినడానికి అమాంతంగా పట్టుకుని తన పొడవాటి శరీరంతో చుట్టేసింది. మామూలు వ్యక్తులు అయితే ఆపాటికి ఎముకలు పటపటా విరిగి చనిపోయే వారు.మరి భీముడు మహా బలవంతుడు కదా! భీముని బలం ముందు కొండ చిలువ బలం సరిపోలేదు.
తనంతటి బలవంతుడిని బంధించే శక్తి ఆ కొండ చిలువకు ఎలా వచ్చిందని భీముడూ, తాను అంత బలంగా చుట్టుకొని చంపాలని చూసినా భీముడు చనిపోలేదేమని ఆ కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుడు అనుకున్నారు.
భీముడు ఆశ్చర్యంగా  కొండచిలువతో"నా అంతటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది ? సామాన్యులకు ఎవరికీ సాధ్యం కాదు"అని అడిగాడు.
అప్పుడా కొండచిలువ  "భీమసేనా!నేను నహుషుడు అనే మహారాజును. మునీశ్వరుని శాపం వల్ల ఈ సర్పరూపం దాల్చవలసి వచ్చింది". అని చెబుతాడు.
తన తమ్ముడైన భీముని వెతుక్కుంటూ ధర్మరాజు ఆ స్థలానికి వచ్చి,ఆ దృశ్యాన్ని చూసి కలత పడతాడు.తమ్మణ్ణి వదిలేయమని బతిలాడుతాడు.అప్పుడు కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు ధర్మరాజుతో తాను కొన్ని ప్రశ్నలు అడుగుతాననీ, వాటికి సరైన సమాధానాలు చెబితే భీముణ్ణి వదిలి వేస్తానని అంటాడు.
అలా నహుషుడు కొన్ని ధర్మ సందేహాలతో కూడిన ప్రశ్నలు అడగడం, వాటికి ధర్మరాజు సరైన సమాధానాలు చెప్పడంతో  నహుషుడు భీముణ్ణి వదిలి వేస్తాడు.ఇలా సందేహాల నివృత్తితో నహుషుడికి అజగర రూపం పోయి అసలైన మనిషి రూపం వస్తుంది.శాపవశాత్తూ అజగరముగా మారిన మనిషి కథ అది.
అయితే మనం చెప్పుకుంటున్న "అజగర న్యాయము"లో అజగరము/ కొండచిలువ పైన చెప్పిన కథలో లాంటిది కాదు.ఇది మోసకారితనానికి,దుష్టత్వానికి  గుర్తు. 
ఇలా ఏమీ ఎరుగని వానిలా,తన వల్ల ఎలాంటి హానీ కలుగదనే అమాయకత్వం నటిస్తూ, ఏమీ ఎరుగనట్లు  భ్రమను కల్పించే వారు మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరు వ్యక్తులు వుంటారు.వాళ్ళు చాలా ప్రమాదకారులు. వారు చేసేది "అజగరోపవాసం" అంటే కొండ చిలువలా తిండి మానేసినట్లు కనిపించడం అన్న మాట.కొండచిలువా తిండి మానేయదు ఇలాంటి మోసకారి బుద్ధిగల వారు వారి బుద్ధినీ  మార్చుకోరు.అందుకే వారి పట్ల సదా అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే ఈ న్యాయములోని ప్రధానమైన ఉద్దేశం.
 కాబట్టి  మనమూ అప్రమత్తంగా ఉందాం.ప్రమాదాలను ముందుగానే పసిగట్టి మనకెలాంటి హానీ జరగకుండా చూసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు