సుప్రభాత కవిత బృంద
రవి కురిపించు  కృప
జాడ ఎరిగి వేనోళ్ళ
అవనికి చాటింపుగ
శ్రవణము చేయించు 
మారుతము...

ఇనుడి గొప్పదనమెల్ల
ఇంపుగా పాడుతూ 
నిరతము నామ స్మరణము
నీమము తప్పక చేసే
జలపాతాలు...

తెల్లవారక ముందే
రెక్కలు విదిలించి ఎగిరి
కువకువల గీతాలతో
కశ్యపాత్మజుని కీర్తనము చేయు
విహగాళి.....

కదిలొచ్చు గగనవీధిని
చక్కని రంగవల్లులు దిద్ది
అరుణుడికి ఎర్రటి తివాచీ
పరచి పాదములు సేవించు
జీమూతములు

రకరకాల రంగుల అందమైన
అద్భుత సుగంధములు
వెదజల్లు సుమ సమూహములతో
పవిత్ర పత్రములతో  అర్చించు
పుష్పలతలు

కరములు జోడించి
కనులు తెరచి తపముని
రాకకై తపము చేయు
మునుల వోలె వందనము సేయు
శిఖరములు

భానుడిని సేవించు కోరికతో
ఉదయించినది మొదలు
అస్తమించువరకు ఆన మీరక
వెనువెంట నడచి దాస్యము చేయు
గగనము

ఆవిరైపోతున్నా వదలక
ఆదిత్యుని సాంగత్యము కోరి
మబ్బుగా మారి సన్నిధికి చేరి
ప్రేమకు కరిగి నీరగు సఖ్యము
సముద్రునిది..

ప్రతిదినమూ పలవరించి
ప్రభవించినంతనే పరవశించి
మార్పులు పొంది ఆదిత్యునికి
ఆత్మ నివేదనము చేయు
ప్రకృతి సమస్తము.

దినకరుని రాక శుభకరమై
మధువనమైన హృదయాన
జీవన మకరందము నింపుమని
మకర సంక్రమణ వేళ మనవిగా

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు