భూజాత సీత;- పొర్ల వేణుగోపాల రావు, టీచర్,ఎల్లారెడ్డిపేట
 (1)
కలలు నిజమైన తీరున
పొలమును దున్నగ రయమున పుడమిన తగిలెన్
హలమును బట్టుక జూడగ
నెలవంకను బోలినట్టి నీరజ దొరికెన్
(2)
కనబడె పేటిక యందున
తనయగ శ్రీదేవి, రాజు ధన్యత జెందెన్!
మనసున సంతోషించెను
జనులందరు పొగడిరంత జనకుని, సీతన్
(జరిగిన విషయం ఏమంటే...)
(3)
యాగము జేసెడి సమయము
కాగల కార్యంబు జరిగె కాడిని బట్టన్
నాగటి చాలుకు దగులగ
మ్రోగిన శబ్దంబు వినగ మురిసెను రాజే!
(4)
ఖంగున తగిలెను చాలుకు
బంగారపు పేటికయది! బరువుగ కదిలెన్
నింగిని దాకగ శబ్దము
పొంగారెను హృదయములవి!భూపతి మురిసెన్
(5)
సిరితా స్వయముగ వచ్చెను
కరుణించెను జనకుని; తన గడపకు జేరెన్!
మురిసెను మిథిలాధీశుడు
చిరకాలపు కోర్కెదీరె.. సీతగ దక్కెన్
*******


కామెంట్‌లు