పంచపది బసవ పురాణము- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది రూపకర్త- హైదరాబాద్ 9440530763
 181
ఒకనాడు అసంఖ్యాక జంగములను చూశాడు
ఇంటికి వచ్చిన వారిని అర్చించాలనుకున్నాడు
తన దగ్గరున్న ధనము సరిపోదని భావించాడు
బిజ్జలుని ధనాగారము కొల్లగొట్టాలనుకున్నాడు
బసవడిని ధనాగారంను చూపమని వేడె విఠల!
182
బసవన్న బ్రహ్మయ్యకు ధనాగారం చూపించాడు
ధనగారాన్ని కొల్లగొట్టి ధనము తీసుకొని వెళ్ళాడు
రాజు రక్షకుల ద్వారా విషయం తెలుసుకున్నాడు
బసవన్నపై ఆగ్రహం ప్రదర్శించి అచటికెళ్లాడు
తవ్విన మట్టి బంగారంగా కనిపించెను విఠల!
183
బసవేశ్వరుడు బ్రహ్మయ్య గొప్పను వివరించాడు
అతడు సామాన్యుడు కాదని రాజుకు చెప్పాడు
అణిమాద్యష్టసిద్ధులుకల యోగియని అన్నాడు
దొంగతనం కాయకంగా స్వీకరించాడని చెప్పాడు
అందుకే ధనాగారానికి కన్నము వేశాడనె విఠల!
184
రాజా!దొంగతనము తప్పని మీరడగవచ్చును
తప్పు అతని దొంగతనములో లేదని చెప్పెను
దాని ప్రయోజనం చూడాలని బసవన్న చెప్పెను
తప్పు ఒప్పులు ప్రయోజనం బట్టి వుండుననెను
బ్రహ్మయ్య జంగములకై దొంగలించాడనె విఠల!
185
జూదమాడి పాండవులు భ్రష్టులైరని అన్నాడు
ఒక భక్తుడు జూదమాడి శివుణ్ణి చేరాడన్నాడు
వేటాడి శ్రీరాముడు భార్యను పోగొట్టుకున్నాడు
వేటతోనే తిన్నడు శివ సాయుజ్యము చేరాడు
రాజా!ప్రయోజనం ముఖ్యమనె బసవడు విఠల!
186
పరసతి వలన రాజులు నశించిరని అన్నాడు
నంది పరసతివల్ల మోక్షంపొందెననె బసవడు
మాండవ్యుడు హత్యచేసి శిక్షననుభవించాడు
చండుడు హత్యచేసి శివానుగ్రహం పొండాడు
రాజా!చేసే కార్యప్రయోజనం చూడమనె విఠల!
187
అబద్ధము చెప్పి బ్రహ్మ తల పోగొట్టుకున్నాడు
చిరుతొండడు అబద్ధం చెప్పి కైలాసాని కెళ్లాడు
గొర్రెను దొంగిలించి శూద్రకుడు నరకం పొందాడు
అదే చేసి శివభక్తుడు శివసాయుజ్యం పొందాడు
బ్రహ్మయ్య చేసింది తప్పు కాదనె బసవన్న విఠల!
188
బ్రహ్మయ్య శివ పూజకై దొంగతనం చేశాడు
ఇతడు శివభక్తుల ఇళ్లకు పోడని అన్నాడు
లుబ్ధుల ధనాన్ని జంగములు,భక్తులకిస్తాడు
నీ ధనాన్ని శివశరణులకొఱకై తీసుకున్నాడు
రాజా!నీ ధనము సరిచూసుకొమ్మనెను విఠల!
189
బ్రహ్మయ్య తన కాయకంతో జంగమార్చనచేశాడు
దాని వలన అతడు శివానుగ్రహమును పొందాడు
నీ డబ్బులు పోయాయని దుఃఖించకని చెప్పాడు
లెక్క చూసి బిజ్జలుడు చాలా ఆశ్చర్య పోయాడు
అప్పుడు బసవేశ్వరుడు చిరునవ్వు నవ్వె విఠల!
190
కళ్యాణంలో శివనాగుమయ్యనే భక్తుడుండేవాడు
ఆయన శివుని భక్తుడు, కులములో అంత్యజుడు 
అత్యంత నిష్టా గరిష్ఠుడు,కాని గుణంలో అగ్రజుడు
బసవేశ్వరుడాయనను అనునిత్య మర్చించేవాడు
అగ్రకులస్తులందరూ బసవన్నను నిందించిరి విఠల!


కామెంట్‌లు