నేనుమరల శిశువునయ్యా!;- డా పివిఎల్ సుబ్బారావు.-9441058797
1.ఓ రామయ్యా!అమ్మానాన్న,
       లేని వాడిని అయ్యా!
     
    అరవై ఏళ్లు నిండాయి,
        చూసావా  మా అయ్యా!
  
   అందరి మాటలు,   
   వినలేకున్నాను ఓ అయ్యా 

   నామాట వినిపించలేని,
      దీనుడై ఉన్నా కదయ్యా!

 కళ్ళతో స్పష్టంగా లోకాన్ని,   
    చూడలేని హీనుడనయ్యా!

2. శిశువు అంటే ముద్దు ,
                లోక సహజం!

   నాకుముద్దుపెట్టమంటే ,
           ప్రతివాడికి వెలపరం! 

శిశువు కేర్ అంటే ,
      తక్షణం కేర్ చేసే జనం!

 నేను భోరుమని ఏడుస్తున్నా,  
          వీడరు తమ మౌనం !

   అందుకే నిరీక్షిస్తున్నా,
          లెక్కిస్తున్నా ప్రతి క్షణం!

3. వృద్ధుడికి ఏవో ,
                పండుగలంట!
  
    బహుశా అది కొందరి,
        సుకృతం అనుకుంటా!

   నా ఉనికి దండుగ,
    ఇది జన తీర్మానమంట!

జాలి, దయ ,కరుణ,ఈ జనం,    
      నిజంగా మరిచారంట!

వృద్ధాశ్రమం వార్ధక్య ,
         నిజ సాఫల్యం మంట!
4.
మనిషిమొక్కల్నిపెంచుతాడు,
         పర్యావరణ పరిరక్షణ!

 కుక్కల్ని ప్రేమగా సాకుతాడు,  
            ఇంటికి సదా రక్షణ !

ఇంటి ముందు గూర్ఖా పోషణ,  
     మనిషి వస్తే బహిష్కరణ!  

మనిషి మనిషిని మనిషిగా, చూడడు, నాగరికత వశీకరణ !

వాడుకో, వదిలించుకో,   
         ఆధునికుల ఆచరణ!

5. వృద్ధాప్యం వయో,జ్ఞాన,
                   వృద్ధి కారకమా ?
   
   జీవితాన ముందుకు,    
   అడుగేయ శాపఅవరోధమా?
   
  జీవన దశలలో,
          ఈ దశ అవహేళనమా ?

ఓవిధాతా!
గొప్పచదరంగ చతుర నిర్మాతా!

నీవు నడిపే పావుల్ని,
 నీవే వెనక్కి తీయరాదా?

రచ్చ చేయకు, రక్షణా చేయకు! 

,ఓ కరుణానిధి! కరుణించి,
    ఏతెంచి ,నీ ఒడి చేర్చి,  
             లాలించవయ్యా!
________
.

కామెంట్‌లు