* శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర *;- --డా.హారిక.నాంపల్లి- కరీంనగర్.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే; ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర - మన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.

మేడారం - తెలంగాణ రాష్ట్రం,ములుగు జిల్లా,తాడ్వాయి మండలంలోని ఒక గ్రామం.
ఇది వన్యప్రాణుల అభయారణ్యం లోని ఒక మారుమూల ప్రాంతం.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి, నాలుగు రోజులపాటు సాగే ఈ మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ముగుస్తుంది.

తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా; ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ మరియు దేశం నలువైపులా నుండి వచ్చి, భక్తిపారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ, మొక్కులు చెల్లించుకునే లక్షలాదిమంది భక్తులతో ఈ జాతర మరో కుంభమేళాను తలపిస్తుంది. దీనిని తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేకంగా పేర్కొంటారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

సమ్మక్క, సారలమ్మలను వనదేవతలుగా కొలిచే ఈ మేడారం జాతర వెనుక ఉన్న చరిత్ర 13వ శతాబ్దానికి చెందినది. దీని గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం... క్రీస్తుశకం 1260-1320 కాలంలో కాకతీయుల పరిపాలనలో, ఇప్పటి జగిత్యాల జిల్లా లోని పొలాసను గిరిజన దొర అయినటువంటి మేడరాజు పాలిస్తూ ఉండేవాడు.

ఒకరోజు కోయదొరలు వేట కోసం అభయారణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారికి చుట్టూ పెద్దపులుల కాపలా మధ్య, ఒక పుట్ట మీద బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను దైవాంశ సంభూతురాలిగా భావించి, కోయదొరలు తమ గూడేనికి తీసుకువెళ్లారు. ఆ పసిపాప గూడేనికి వచ్చినప్పటినుండి ఆ ప్రాంతంలో కరువులు, ఇతర సమస్యలు తగ్గి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు.

ఆ విషయం తెలిసిన మేడరాజు ఆ పాపను తీసుకొని, పాపకు సమ్మక్క అని నామకరణం చేసి, పెంచి పెద్ద చేశాడు. దేవతా రూపం ఉట్టిపడే ఆమె, తన చేతితో మందు ఇస్తే, ఎంతటి రోగమైన ఇట్టే నయమైపోయేదంట.

మేడరాజు... సమ్మక్కకు యుక్త వయస్సు వచ్చాక, తన మేనల్లుడు - మేడారం పాలకుడు & కాకతీయుల సామంతుడైన కోయరాజు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క - పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగినారు. 
ఇలా వారి జీవితం కొన్ని రోజులపాటు సాఫీగా సాగిపోయింది.

కొన్ని రోజుల తర్వాత, కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశ్యంతో మేడరాజు పరిపాలిస్తున్న ప్రాంతం పై దండెత్తడంతో, వారి ధాటికి తట్టుకోలేని మేడరాజు పారిపోయి, తన కూతురు సమ్మక్క దగ్గరకు వచ్చి, అజ్ఞాతవాసంలో ఉంటాడు.

అదే సమయంలో, ఆ రోజుల్లో  ఏర్పడిన తీవ్ర కరువు కాటకాల వల్ల కొన్నేళ్లపాటు మేడారం ప్రజలు కాకతీయులకు శిస్తు కట్టలేక పోయారు.
శిస్తు కట్టకపోగా, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు రేకెత్తించడం మరియు మేడరాజు కి ఆశ్రయం కల్పించి, రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో... కాకతీయ సామ్రాజ్యాధినేత అయినటువంటి ప్రతాపరుద్రుడు ఆగ్రహించడంతో కాకతీయ సేనలు మేడారంపై దండయాత్ర చేపడతాయి. అది గమనించిన పగిడిద్దరాజు మరియు గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేoదుకు సిద్ధమవుతారు. ఈ క్రమంలో గిరిజనులకు, కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరుగుతుంది. సాంప్రదాయ ఆయుధాలతో సమ్మక్క, పగిడిద్దరాజు, మేడరాజు, సారలమ్మ, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ కాకతీయసేనల ధాటికి తట్టుకోలేక సమ్మక్క,
జంపన్న మినహా పై వారందరూ మరియు మరెందరో కోయ ప్రజలు యుద్ధంలో మరణిస్తారు.
వారందరి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక, అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుండి సంపెంగ వాగును, జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతుంటారు.

సమ్మక్క, కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ... ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా తనని బల్లెంతో వెన్నుపోటు పొడవడంతో, కుప్పకూలి పోయి ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ట పైకి వెళ్లిపోతుంది.
గాయాల పాలైన సమ్మక్కను వెదుక్కుంటూ గూడెం వాసులు అడవిలోకి వెళ్లగా, గుట్టపై ఉన్న చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపిస్తుంది. 
ఒకప్పుడు అదే స్థానంలో, అదే పుట్టపై సమ్మక్క దొరికింది.
అలా కుంకుమ భరిణ గా మారిన సమ్మక్కను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు ఆదివాసీలు కట్టాల్సిన శిస్తును రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించి, రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఇలా సమ్మక్క సారలమ్మ జాతర మొదలయ్యిందనే కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది.
అప్పటినుండి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతరను భక్తిశ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది.

ఆదివాసీల ఆరాధ్య దైవాలైన ఈ వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునే ఈ మహా జాతర మొదటి రోజు కీలక ఘట్టమైన సమ్మక్క కుమార్తె - సారలమ్మ ఆగమనంతో ఆరంభమవుతుంది.

కాగా దీనికి ముందు రోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సమ్మక్క కుమారుడైన జంపన్న ను డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.
అదే రోజు మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం, పూనుగొండ్ల గ్రామంలో ఉన్న సమ్మక్క భర్తయగు పగిడిద్దరాజు ఆలయంలో పూజలు నిర్వహించి, పడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకొని, ఆదివాసీ సంప్రదాయాల నడుమ మేడారానికి కాలినడకన 70 కిలోమీటర్లు ప్రయాణించి మరుసటి రోజు సాయంత్రం ( అంటే జాతర మొదటి రోజు సాయంత్రం) జంపన్న వాగు దగ్గరకు చేరుకుంటారు.

మొదటిరోజు ఉదయం ములుగు జిల్లా, ఏటూరు నాగారం మండలం, కొండాయి గుడి నుండి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు.
అదే రోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు తీసుకు వస్తారు.
అదే రోజు రాత్రి సమయానికి పగిడిద్దరాజు, తన బిడ్డ సారలమ్మ, అల్లుడు గోవిందరాజులతో కలిసి ఊరేగింపుగా వచ్చి, గద్దెలపై కొలువు తీరుతారు.

రెండవ రోజు మేడారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేసి, సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. ఇది ఈ జాతరలోని అత్యంత కీలక ఘట్టం.

మూడవరోజు అమ్మ వార్లు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి, భక్తులకు దర్శనమిస్తారు(నిండు జాతర). నాలుగవ రోజు అమ్మ వార్ల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగుస్తుంది.

భక్తులందరూ ముందుగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి, వాగును ఆనుకొని ఉన్న జంపన్న గద్దెను,
ఆ తర్వాత అమ్మ వార్ల గద్దెలను దర్శించుకుని, వారి వారి మొక్కులను సమర్పిస్తారు.

జాతర సమయంలో ఉండే భక్తుల రద్దీ ధాటికి తట్టుకోలేని వారు, జాతరకు కొన్ని రోజుల ముందుగానే అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని, వారి వారి మొక్కులను సమర్పించుకుంటారు.

ఈ జాతరలోని ప్రత్యేకతలు : 
1) సమ్మక్కను కుంకుమ భరిణ రూపంలో మరియు సారలమ్మను మొంటె రూపంలో కొలవడం
2) వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం
3)బెల్లాన్ని బంగారంగా భావించి, ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడం.
4) మొక్కు చెల్లింపుల అనంతరం, అక్కడి పచ్చటి వనాల్లో వన భోజనాలు చేయడం.
5) ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు; వారి జీవన శైలి; సమ్మక్క సారలమ్మ పుట్టుక నుండి తిరిగి వన ప్రవేశం వరకు తెలియజేసే దృశ్యాలు కళ్ళకు కట్టేలా ప్రతిబింబించే... సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం.

ఈ జాతర మనకు తెలియజేసే విషయం ఏమిటంటే... దేవుళ్ళు వేరే ఎక్కడో ఉండరని, సామాన్య ప్రజానీకానికి మేలు చేసి, వారికి రక్షణ కల్పించే వారినే దేవుళ్ళుగా కొలుస్తారని నిరూపిస్తుంది.
కోరుకున్న భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ వనదేవతలు సదా పూజ్యనీయులు.

మా ఇంట్లో కూడా సమ్మక్క- సారలమ్మలను కొలుస్తాము. ఇందులో భాగంగా ఇప్పటివరకు మూడుసార్లు నా ఎత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించడం జరిగింది.

కొసమెరుపు ఏమిటంటే సమ్మక్క పెరిగి పెద్దయిన పొలాస గ్రామం, జగిత్యాల జిల్లా ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగం అవడం విశేషం.
ఈ విధంగా చూస్తే సమ్మక్క మా జిల్లా ఆడపడుచు అవడం మా అదృష్టం.

అదే విధంగా, ఒక స్వచ్ఛంద సంస్థ ములుగు జిల్లా ప్రాంతంలోని గిరిజనుల కొరకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు మరియు ఎనిమిది వందల మందికి చేసిన ఉచిత బ్లడ్ గ్రూప్ చెకప్ క్యాంపులో నేను ఇలా రెండు పర్యాయాలు పాల్గొని,
అప్పటి ములుగు జిల్లా కలెక్టరు శ్రీ. సి. నారాయణ రెడ్డి గారు, ఐ.ఏ.స్. & ఎస్.పి. శ్రీ సంగ్రాం సింగ్ పాటిల్, ఐ.పి.ఎస్ గార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది.

ఆ సమ్మక్క- సారలమ్మల దాతృత్వం మరియు పోరాట పటిమల స్పూర్తితో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.
మొదటి ఫోటో ; అమ్మవార్ల గద్దెల వద్ద (మేడారం సందర్శనలో భాగంగా, 2024)
రెండో ఫోటో ; నా ఎత్తు బంగారం (18.02.2024)
మూడో ఫోటో ; ములుగు జిల్లాలో గిరిజనులకై ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నందుకుగాను... అప్పటి కలెక్టర్ & ఎస్.పి. గార్ల చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకుంటూ (07.11 2019)
కామెంట్‌లు