నిర్మలమైన హృదయం;- సి.హెచ్.ప్రతాప్

 బురద నీటిలో ముఖం స్పష్టంగా కనిపించదు.నిర్మల హృదయంలో మాత్రమే భగవంతుని రూపం పవిత్రంగా ప్రతిఫలిస్తుంది. లోక వ్యవహారాల్లో చిక్కుకుని, అశాంతి పాలై  ఆత్మానందానికి దూరం కావద్దు, ఇటువంటి పవిత్ర నడవడి ద్వారా మాత్రమే మన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి. నిర్మలమైన మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని మీద నిలిచి ఉంటుంది అని అర్థం. ఎందుకంటే మానవులు సాధారణంగా ప్రాపంచిక విషయాలనే కోరుకుంటారు. అనుక్షణం ప్రాపంచిక విషయాలనే ధ్యానం చేస్తూ వుంటారు. వారి మనసులు కోరికలనే విషవలయంలో చిక్కుకొని వుంటాయి. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుట్టుకొస్తూ వుంటుంది. శరీరం అంతిమ యాత్రకు సిద్ధపడే సమయంలో కూడా మానవులకు కోరికల యావ తీరదు. అటువంటి మనసును పరమాత్మయందు నిలపడం చాలా కష్టం. మనసు ప్రాపంచిక విషయాలలో లీనం కావడం వలన మలినమైన చిత్తాన్ని ఆధ్యాత్మికమైన చిత్తంగా మార్చడం అంటే మనస్సు భగవంతుని మీద నిలపడం, మనసును నిగ్రహించడం ప్రతి సాధకుడి కర్తవ్యం.
కాబట్టి ప్రతిరోజూ కొంచెం సేపు అయినా ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి, భగవంతుని ముందు కూర్చుని కళ్లు మూసుకొని మనస్సును నిగ్రహించి భగవంతుని మీద నిలపడం తప్పక చేయాలి. ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మ భావముతో నిండి వుండే ప్రయత్నం చేయాలి. మమత, మమకారాలు, ఆశలను, సంతాపాలను దూరంగా ఉంచాలి. దానినే "ఆధ్యాత్మ చిత్తము" అని శాస్త్రం చెబుతోంది.
ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో..
"చిత్తంతో ఆ పరమాత్మకు అర్పించి, ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశాలను వదిలిపెట్టి, క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి." అని అన్నాడు.మనం ఏమి నివేదన చేసాము అనేది కాదు ముఖ్యం. దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో, వ్రతాలలో, కావాల్సింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెండింటికీ ఎటువంటి ధనం అవసరం లేదు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, నిర్మలమైన మనస్సు, భక్తి లేకపోతే అవి వ్యర్ధము. ఇవి పూజలకు కావాల్సిన అర్హతలు అని మనం వెంటనే గ్రహించాలి.నిర్మలమైన హృదయం లోనే భగవంతుడు నివాసం ఉంటాడు. సంతోషంతో నిండిన హృదయం ఓర్పును ఆనందదాయకం చేస్తుంది.మనం రక్షణ, స్వతంత్రత, అభివృద్ధి, సుఖం, ప్రశాంతత, ముక్తి కోసం.. దైవారాధన చేస్తుంటాం. వివిధ ద్రవ్యాలతో పూజ చేసినా.. కర్తకు ప్రధానంగా ఉండాల్సింది నిర్మలమైన మనసు!దైవారాధనకు కావాల్సింది ద్రవ్యాలు, ఆర్బాటాలు కాదు. దైవాన్ని ప్రేమతో పూజించాలి. ఉపచారాలు విగ్రహానికి చేస్తున్నా.. స్వయంగా దేవుడికే చేస్తున్నామన్న అనుభూతి పొందాలి. అలా చేయగలిగిన పూజ సార్థకం అవుతుంది. దైవానుగ్రహానికి పాత్రత పొందుతుంది. 
కామెంట్‌లు