సునంద భాషితం -- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -415
అపృచ్ఛోత్తర న్యాయము
*****
పృచ్ఛ అనగా ప్రశ్న,అడుగుట.అపృచ్ఛ అనగా అడగకుండా, ప్రశ్నించకుండా.ఉత్తర అనగా భవిష్యత్కాలము,, విష్ణువు, శివుడు, విరాటుని కుమారుడు,ఒక నక్షత్రము, విరాటుని కుమార్తె ఉత్తర (అభిమన్యుని భార్య), సమాధానము,ప్రతివాదము, సమాసపు చివరి పదము,మూత,సమాప్తి, మిగిలినది, అధికము, శేషము, భేదము, ఆపైన, తరువాత... ఇలా చాలా అర్థాలున్నాయి.
 మీరిక్కడ గ్రహించాల్సిన అర్థము ఏమిటంటే అపృచ్ఛోత్తరము అనగా అడగకుండానే ప్రత్యుత్తరం/ సమాధానాలు చెప్పుట.
ఇది కూడా ఓ న్యాయమేనా? అని మీరు అడగకుండానే,ప్రశ్నించకుండానే "ఔనండీ, ఔను ఇది మన పెద్దలు సృష్టించినది.నేనైతే సృష్టించలేదండీ.ఐనా నాకంత పరిశీలనాత్మక శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అస్సలు లేవండీ.
అయితే గియితే మన పెద్దలు చెప్పిన సంస్కృత న్యాయాలకు నాకు తెలిసినంత మేరకు న్యాయం చేయాలనే తపనకొద్దీ, మీకు కూడా వీటిని తెలియజేయాలనే ఆరాటం కొద్దీ ఇదిగో ఇలా అక్షర రూపమిచ్చి  మీకు తెలియజేస్తున్నాను.అంతే సుమండీ.
ఇదంతా చదువుతున్న మీకు ఈపాటికే అంతులేని అసహనం మొదలై వుండాలి.ప్రశ్నలేమీ అడగకుండానే ఇన్ని విధాలుగా సమాధానాలు చెప్పాలా! అని"
 హమ్మయ్య! నా ఆలోచనల బరువు దిగిపోయింది.ఈ "అపృచ్ఛోత్తర న్యాయమంటే" ఏమిటో మీకు పూర్తిగా తెలిసిపోయింది.
 ఇలా ఏమీ ప్రశ్నించకుండానే వారికి వారే ప్రశ్నలు ఊహించుకుని సమాధానాలు చెప్పేవాళ్ళు  మన చుట్టూ సమాజంలో ఉన్నారని మన పెద్దవాళ్ళు చాలా నిశితంగా పరిశీలించే ఈ న్యాయమును సృష్టించి చెప్పారన్న మాట.
 వీళ్ళని చూసే వారికి,మాట్లాడే వారికి  కాసేపు సరదాగానే ఉంటుంది.ఆ తర్వాత అసహనంగా కూడా వుంటుంది. కానీ తలుచుకుంటే మాత్రం కడుపుబ్బ నవ్వు కూడా వస్తుంది.
అదేదో సినిమాలో  ఎల్ బి శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో  అధికారి అడిగే ప్రశ్నలను తెలుసుకుని  వేణు మాధవ్ తో బాగా బట్టి పట్టిస్తాడు.లోపలికి వెళ్ళిన వేణుమాధవ్ ను అధికారి వేరే ప్రశ్నలు అడుగుతాడు. అయితే వేణు మాధవ్ మాత్రం ఎల్ బి శ్రీరామ్ బట్టీ పట్టించిన సమాధానాలు చెప్పడంతో వేణు మాధవ్ సెలెక్ట్ కాడు.
ఇక అప్పుడు చూడాలి వేణు మాధవ్ ను తీసుకుని వెళ్లి మీరడిగిన ప్రశ్నలే తప్పు.మావాడు చెప్పిన జవాబులు రైటు.మరెందుకు సెలెక్ట్ చేయలేదని వాదనకు దిగుతాడు. ఆ సీన్ తలచుకుంటే ఎవ్వరికైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది.
ఇలా ప్రశ్న ఒకటైతే జవాబు మరోటి చెప్పేవాళ్ళు. అసలు ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే  ఆయా ప్రశ్నలను ఊహించుకుని 'వస దాగిన పిట్టోలే ' సమాధానాలు చెప్పేవాళ్ళు నిత్య జీవితంలో కొంత మంది మనకు తారసపడుతూ వుంటారు.
అంతే కాదు కొందరికి అడగకుండానే సలహాలు చెప్పే అలవాటు వుంటుంది.పొరపాటున నోరు తెరిచి అడిగామా... ఇంకేముంది వారి సలహాలు పాటించేదాకా తుమ్మబంకలా అంటుకుని పాటించేంతవరకూ వదిలిపెట్టరు.
ఇక ఐపోయాం రా దేవుడా! అనుకుంటూ భరించే వారినీ,అక్కడ అలాగే వుంటే ఏమై పోతామోనని భయంతో చల్లగా అక్కడ నుంచి జారుకునే వారిని మనం చూస్తూ వుంటాం.
మరి అలాంటప్పుడు ఇలాంటి "అపృచ్ఛోత్తర న్యాయము"ను గుర్తు చేసుకుందాం.మన శ్రమ,అలసట మర్చిపోయి హాయిగా మనసారా నవ్వుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు