సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -398
అశోక వనికా న్యాయము
******
అశోక అనగా శోకము లేని, ఎఱ్ఱని పూలు గల చెట్టు,అశోక వృక్షము,మన్మథుని ఐదు బాణములలో ఒకటి.వనికా అనగా చిట్టడవి.
 లంకలో సీతను రహస్యంగా ఉంచడానికి అనేక స్థలాలు ఉన్నప్పటికీ రావణాసురుడు ఆమెను అశోకవనంలోనే వుంచమని రాక్షసులను ఆదేశించాడు.
అ సీతమ్మ తల్లిని ఎక్కడ వుంచాలా అని  రావణాసురుడు అనేక రకాలుగా ఆలోచించాడు.చివరగా  ఆమెను అశోకవనంలో వుంచితేనే  శ్రేయస్కరం అనే నిర్ణయానికి  రావడం జరిగింది.
మరి దీని అంతరార్థం ఏమిటో చూద్దాం. ఒక పనిని సాధించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, తనకు నచ్చిన, మనసుకు మెచ్చిన నిర్ణయం తీసుకుని దానినిలా ఆచరణలో పెట్టడాన్ని ఈ "అశోక వనికా న్యాయము"తో పోలుస్తారు.
 ఎలాగూ అశోక అనే వృక్షం పేరు వచ్చింది కాబట్టి  ఆ వృక్షం గురించి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాము.
అశోక వృక్షమును అశోక చక్ర వృక్షము అని కూడా పిలుస్తారు.బుద్దుడు  అశ్వత్థ వృక్షముతో పాటు కొంత కాలం పాటు అశోక వృక్షం క్రింద కూడా కూర్చొని ధ్యానం చేశాడని కొంతమంది చెబుతారు. మరికొంత మంది ఈ వృక్షం క్రిందే బుద్ధుడు జన్మించాడని నమ్ముతారు .ఇలా బౌద్ధ మతానికి  ప్రతీకగా ఈ వృక్షం నిలిచింది.అంతే కాదు అశోకుని ధర్మచక్రంతో కూడా ఈ వృక్షానికి సంబంధం కలిగి ఉంది.
 ఆశోక వృక్షము యొక్క జీవిత కాలం  మూడు వందల సంవత్సరాలకు పైగానే  వుంటుందని  వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వృక్షానికి గంధర్వ పక్షికి ప్రత్యేకమైన బంధము ఉందట.అందువల్ల ఈ వృక్షాన్ని గంధర్వ  వృక్షము అని కూడా పిలుస్తారు.ఈ చెట్టు పూవులు చాలా అందంగా మరియు సువాసన కలిగి వుంటాయి.ఈ పూవులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వసంత కాలంలో పూస్తాయి.
 ఇలా అశోక చెట్లతో  వున్న వనానికి రామాయణానికి ఎంత అనుబంధం వుందో మనందరికీ తెలిసిందే.
దండకారణ్యం నుండి అపహరించిన సీతను తన రాజభవనంలో ఉంచాలని అనుకున్నాడనీ,సీత అందులో వుండటానికి ఒప్పుకోక పోవడం వల్ల  ఆమెను అశోకవనంలో వుంచాడని కొందరు అంటుంటారు.
అయితే అశోక అంటేనే శోకం లేనిదని  కదా అర్థం.మరలాంటి వనాన్ని రాక్షసుల వాస్తు శిల్పి అయిన మయుడు ఈ అద్భతమైన వనాన్ని రూపొందించాడు.మధురమైన ఫలాలు , పక్షుల కిలకిలా రావాలు, చక్కని ఆరోగ్యానికి కావలసిన ప్రాణవాయువు,, అనేక రకాల వనమూలికల చెట్లు, జలకాలాడటానికి కొలను,మత్తెక్కించే పూల సువాసనలు.. ఇలా పంచేంద్రియాలు ఐదింటికీ ఉల్లాసం, ఉత్సాహం కలిగించేలా ఈ అశోక వనమనే ఉద్యానవనం తయారు చేయబడింది.
మరి రావణుడు సీతను అశోకవనంలో వుంచడానికి కారణం రామునికి దూరమై శోకిస్తున్న సీతమ్మకు శోకాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనూ...
 ఎవరైనా స్త్రీని బందీగా తీసుకుని వస్తే రాజ ప్రాసాదంలోని ఎక్కడో ఒక చోట రహస్యంగా ఉంచుతారు కానీ ఇలా చెట్లు,వనాలు అడవిలో వుంచరని అనుకునేందుకు కూడా రావణుడు సీతను ఆ విధంగా అశోక వనంలో వుంచాడన్న మాట.
ఇలా ప్రత్యర్థులను పక్కదారి పట్టించేందుకు పన్నే వ్యూహ రచనను ఇలా "అశోక వనికా న్యాయము"తో  పోల్చవచ్చు.
ఏది ఏమైనా ఈ "అశోక వనికా న్యాయము" పుణ్యమా అని కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు