సుప్రభాత కవిత ; -బృంద
పూలగాలి వీచే వేళ
గాలి ఈల వేస్తుంటే
మనసు పరుగు తీసి
పూలు వెదికి పట్టుకోదా?

తెలివెలుగులు చుట్టుముడితే
కలతల చాప చుట్టిపెట్టి
కొత్త ఆశల కాంతివైపు
కోరికలు అల్లుకోదా?

తెల్లారి వెలుగు
చిన్నబోయిన తిమిరాలను
తన నీడగ దాచుకుంటూ
వెలుతురు వెల్లవేసి పోదా!?

గతములన్నీ  మాసిపోగా
వెతలన్నీ తీరిపోగా
కథ మారి సుధలు పొంగే
పొద్దుపొడుపునకు స్వాగతమనదా!

చేరువగా చెలిమిని రమ్మని
కరువుతీర మమతలన్నీ
అలుపులేక చూపించే
అందమైన క్షణాలెన్నో అందించదా!

ఊహించని తలపులన్నీ
కోలాహలంగా  చేతులుకలిపి
కోలాటం ఆడినట్టు సందడి చేస్తే
ఆపలేక చిన్ని గుండె పొంగిపోదా!

నిన్నటిని గతం చేసి
నేటిని సొంతం చేసి
రేపటిపై ఆశను పెంచే
ఈనాటి తొలిసంధ్యకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు