సుప్రభాత కవిత ; - బృంద
పరికించే మనసుంటే
మై మరపించే సోయగాలతో
మురిపించే  కమ్మని తావులు
కురిపించే ఆహ్లాదమెంతో!!

కన్నులతో దర్శించి
చూపులతో స్పృశించి
తలపులలో ముద్రించి
మది నింపుకున్న అందాలు

కలతలు లేని కన్నీరెరుగని
అసూయలు లేక అమాయకంగా
అహంకరించక సహకరిస్తూ
వికసించి వర్ధిల్లే వనసంపద

అందమైనా గంధమైనా
ఓదార్పైనా ఔషధమైనా
కనులకైనా మనసుకైనా
ఇవ్వడమే తెలిసిన ప్రకృతి

సంరక్షించమని అడగదు
సహకరించమని కోరదు
సన్నిధిలో సమస్త రుగ్మతలు
సంతోషంగా తీర్చే అడవితల్లి

అడగదని గౌరవం ఇవ్వకపోతే
ఆశించదని నిర్లక్ష్యం చేస్తే
అమ్మ లా ప్రేమించడమే కాదు
అమ్మతల్లిలా మింగేయదా?

సమస్త జగతినీ గమనిస్తూ
తమంత తామే తెలుసుకుని
తప్పులు సరిదిద్దుకుని
గొప్పగా  బ్రతకమనే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు