అడవి;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 శుక పికముల గానమాధుర్యము
కరములకందేటి పుష్పలావికలు
వాతముకు లొంగని వృక్షతతులు
వాలాయముగ నుండు హరితపత్రములు
భామము చొరనట్టి లతగుల్మ జాతులు
కలకలము చేసేటి వాయసములు
శోకమును వదిలినవారి ఓకమై వరలేటి
సముచిత నిర్ణయం తీసుకున్నట్టి
లోకమును త్యజించిన సత్పురుషులు
అవిభాజ్యమైనట్టి ఆత్మ అనాత్మ విచికిత్స
సభాభవనమున తేలదని తలచి
వేషమును మార్చి స్థలమునుకూడా మార్చి
కమఠమును చేపట్టి కమలజుని తలపోసి
మధురమైనట్టి నామము జపముచేసి
కరములుమోడ్చి మోకరిల్లెడి ఆ అడవి ఎంత
ప్రముఖమైనది కదా ! 
అది నైమిషమనెడి పేరుగలది!!

{వాతము=గాలి;వాలాయము=ఎల్లప్పుడు;
భామము=సూర్యకిరణాలు;ఓకము=ఆశ్రయము;
కమఠము=భిక్షాపాత్ర;కమలజుడు=బ్రహ్మదేవుడు}
**************************************

కామెంట్‌లు