గెలిచిన ప్రేమ; - రాధా రాణి. వేమూరి- మెంబెర్, ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ -హైదరాబాద్

  గోదావరి గలగలలు. పడవల్లో పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళు. గోదారి తల్లికి అలుపే లేదు. బిడ్డల్ని ఈ దరి నుండి ఆ దరికి చేరుస్తూనే ఉంటుంది. ఎన్ని కథలకు సాక్ష్యమో ఆ తల్లి. ఎన్నిటిని తన కడుపులో దాచుకుంటుందో. నిండుగా తొణికిసాలాడుతూ ఉంటుంది ఎప్పుడూ.
  అదిగో ఆ గోదారి ఒడ్డున నుల్చుని రెండు కళ్ళు తదేకంగా చూస్తూనే వున్నాయి.
  "ఏయ్ రంగి!ఏంటే ఆ ఆదమరుపు? ఎప్పటి నుండి పిలుత్తున్న ఉలుకు పలుకు లేదే? పడవలన్నీ ఎల్లి పోయినయ్ పద " అంటూ శాంతి కదిలించే సరికి ఉలిక్కి పడి కదిలింది. కానీ,చూపులు మాత్రం ఎక్కడో చిక్కుకొని వున్నాయ్. కళ్ళకు పడవలు కానొస్తున్నంత లెక్క దృష్టి సారిస్తూనే ఉంది.
  "ఏమే ఏముందనే అక్కడ అదే పనిగా సూత్తున్నావ్. రంగడి కోసమేనా నాకు తెలుసులే "అంటున్న శాంతిని
"చీ పో నీ వేళాకోళం నువ్వు. అట్టాంటిదేం లేదు ".
  "అరె, అరె సూడు బుగ్గలు కెంపులవ్వలా "
"అబ్బా ఏందే నీ గోల? నా మావ కోసం చూత్తే తప్పేటంటా? అయినా రేపో మాపో మనువాడతాముగా అంటూ తుర్రున పరిగెత్తింది రంగి.
 రంగి చిన్నప్పుడే అమ్మా అయ్యా పోతే వాళ్ళ అవ్వ పెంచింది. అదేం దురదృష్టమో రంగి కి పదేళ్లు వచ్చేటప్పటికి అవ్వ కూడా కాలం చేసింది.
  అదుగో అప్పటి నుండి రంగడే అన్నీ చూసుకుంటున్నాడు.రంగడు రంగి కి బావ వరస. రంగడు కూడా తల్లి తండ్రులు లేకుండానే అవ్వ దగ్గర పెరిగాడు. రంగి కి రంగడే ప్రాణం. రంగడు ఊరి ఆసామి పడవ నడుపుతాడు.ఆసామి ఎంత సెబితే అంత. రంగడి లాంటి వాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం లేదు.
వాడు వెళ్లి వచ్చేదాకా కళ్ళు ఏటి వైపే. ఇద్దరు కలిసి ఎన్ని కబుర్లో. గోదారి అమ్మ సాక్షిగా సరసాలు ఆడుకుంటారు. గోదారమ్మే ఇద్దరికీ అమ్మ. ఏదున్నా అమ్మతోనే.
  ఓరోజు "రంగి ఇంకెంత కాలమే పెళ్లి చేసుకుందామే "అన్నాడు రంగడు
   "ఇదిగో మావా నా గోదారమ్మ మీన ఒట్టు. నువ్వు సొంతంగా పడవ కోనేదాకా అట్టాంటి మాటలు మటాడక "అంది రంగి 
   ఆ శుభ ముహూర్తం కోసం గోదారి కూడా ఎదురు చూస్తుంది.
  వడి వడిగా పని చేసి ఆసామి ఇంటికి పనికి పోయింది.
"యేటబ్బా ఇది స్మశానంలో ఉన్నట్టు ఎప్పుడూ నిశబ్దం గా వుంటది. ఈ ఏల గోల గోల గా ఉంది " అనుకుంటు లోపల అడుగెట్టింది.
     చిన్న బాబు ఆసామి ఒకే ఒక కొడుకు పట్నం లో చదువుకుని వచ్చాడు. డబ్బు మదం కొట్టొచ్చినట్టు మాటల్లో, చేష్టల్లో కనపడతాంది. ఆయన గోరు ఆయనతో పాటు ఇంకో నలుగురు దోస్తుల్ని ఏసుకుని వచ్చారు.
  ఆ బాబుని చూత్తే రంగికి జెర్రులు పాకినట్టు ఐతాది. ఆడోళ్ళని తినేసేటట్టు సూపులు.
   పనంతా చేసి ఇంటికి బయలుదేరింది రంగి.
  "రంగి, ఏందే మాంచి హుషారుగా వున్నావ్. ఆ సొగసంతా మోరటోడికి దాయక పోతే నా దగ్గరకి రావచ్చుగా. నేను సుఖ పెడతాగా "అంటూ దారికి అడ్డు నిల్చున్నాడు ఆసామి కొడుకు.
"ఊకోండి బాబు మీ ఎకసెక్కాలు. ఇంతకు మునుపే సెప్పాను నా జోలికి రావద్దని. ఇదేం బాలేదు నన్ను పోనియ్యండి.
  "ఏంటే అంత పొగరు? 
ఆ మొ రటోడిని చూసుకునా!ఏముందే వాడిలో.
నా మోచేతి గంజి తాగేటోడు వాడు.చూస్తాను నీ పొగరూ వాడి పొగరు అంటూ రంగి చేయి పట్టాడు.అంతే రెండు చెంపలు వాయించి ఇంటికి వచ్చింది.
 ఇంటికి వచ్చింది కానీ మనసు మనసులో లేదు. మావ గుర్తుకొచ్చాడు.వెన్నెల్లో పక్క వేసి చుక్కల్తో మావ కబుర్లు చెబుతూ నిద్దరోయింది.
    భానుని కిరణాలు సురుక్కుమంటే అప్పుడు మెలుకు వచ్చింది. అయ్యో అందరూ ఎల్లి పోయింటారు నేనే ఆలస్యం అనుకుంటూ బుంగ తీసుకుని బయలుదేరింది.
     "హే హేయ్ ఈ యాల పడవలు బేగిన వత్తున్నాయి. లచ్చిమి దేవి కరుణించిందేమో. వలల చాపలు పడుంటాయి. ఎట్టుకోండి!ఎట్టుకోండి!గంపలు అంటూ హడావిడి. ఇదంతా దూరం నుండి చూసిన రంగి మావ వచ్చేసినట్టున్నాడు అనుకుని పరిగెట్టింది.
  అన్నీ పడవలు కాళీ అయ్యాయి అందరూ ఎల్లి పోయారు రంగడి జాడ లేదు.
రంగి కి గుబులుగా వుంది.మావకేమైనా అయ్యిందా గంగమ్మ తల్లి నా మావని సల్లంగా సూడమ్మా అంటూ మొక్కుతూనే ఉంది.
   అటుగా వస్తున్న సీతయ్య ని సూసి
"సీతయ్య మావా మా రంగడు రాలేదా "?అంది
"ఏమోనే నేను సూడలేదు "
 అయ్యో గోదారమ్మ తల్లి నా రంగడిని సల్లంగా సూడమ్మా అంటూ ఇసుకలో కూలబడింది.
ఏడుపు తన్నుకుంట వస్తోంది.
 వెనక నుంచి చెయ్యి పడింది.    "ఏంటి ఇక్కడ కూకున్నావ్ "
అన్నాడు రంగడు.
గట్టిగా కౌగాలించుకుని ఏడ్చేసింది.
  "ఏటే ఇది ఎందుకు ఏడుపు?".
 నువ్వు రాకపోయేసరికి పై పానాలు పైనే పోయాయి. మావా ఏటి ఈ ఎకసెక్కేలు? అంటూ బుంగమూతి పెట్టింది.
     "దీనికే ఇంత భయమా?ఊరికే నిన్ను ఆట పట్టించాలని ఇల చేశాలేవే "
  "పో నాతో మాటాడకు "అంటూ దూరం జరిగింది.
  
  నీతో గాక ఇంకోళ్లతో మాట్లాడతానే సెప్పు ఇంకెప్పుడు సేయనులే. లే వెళ్దాం "
"నేను రాను. నువ్వెళ్లు "
"మా మంచి రంగి కదూ, మావతో మాటాడుద్ది "అంటూ బతిమిలాడేసరికి కరిగిపోయి రంగడి ఒడిలో ఒదిగి పోయింది.
వాళ్ళ సరసాలు గోదారమ్మకి అలవాటే నవ్వుకుంటూ కదిలిపోతుంది.
  "మావా! నేనోటి అడుగుతా. సరే అనాల "
"ఏటే అది నా రంగి అడిగితే కాదంటమా!"
  "అది!అది మనం పెళ్లి చేసుకుందాం".
"అదేంటే ఇప్పటికిప్పుడు పెళ్లంటే ఎట్టా "?.
"నాకేం తెలీదు పెళ్లి చేసుకోవాలి అంతే ". లేదంటే నేను గోదారి తల్లి లో కలిసి పోతా ".
 "ఎన్నడూ లేనిది ఈ యాల ఇట్టా మాట్టాడుతున్నావ్. ఏమైందే నీకు ?.
  ఏం కాలేదు.కానీ పెళ్లి సేసుకుందాం.ఇప్పుడే ఇక్కడే ".
 "సరే ఆసామి దగ్గరకు పోయి సెప్పి ముహూర్తం పెట్టుకుని వత్తా "
    " ఏం వద్దు.గోదారమ్మ ఉండగా ఇంకెవరు అక్కర్లేదు. ఆ తల్లే మన పెళ్ళికి సాక్షం. అంటూ బొడ్లో నుండి పసుపు కొమ్ము తీసి ఇచ్చింది.
  గోదారమ్మ సాక్షిగా ఇద్దరూ ఒకటయ్యారు.
 ఇప్పుడు నువ్వు నా సొంతం అంది గర్వంగా రంగడిని సూత్తు.
   "నేను ఎప్పుడూ నీ సొంతమేనే "అంటూ దగ్గరకు లాక్కోబోతే
"ఉండు  మావా ఇంటికి ఎల్లి తానం చేసి సాయంత్రం కొత్త బట్టలు కట్టుకున్నాక "అంది సిగ్గు పడుతూ.
  "ఓసోసి అయన్నీ సిగ్గులే"కాసేపు దాసుకోవే అంటుంటే ఇంకా సిగ్గుల మొగ్గయ్యింది.
  "సరే పద ఎళ్దాం అంటూ ఇంటికి ఎల్లి సక్కగా ముస్తాబయ్యారు ఇద్దరూ.
 "ఎన్నడూ లేనిది రంగి చందమామలా కనపడింది రంగడకి. కల్లార్పకుండ రంగినే సూత్తన్నాడు.
 "ఛీ ఏంటా సూపులు "అంటూ గోముగా రంగడి వళ్ళో తల పెట్టుకుంది.
  ఇంతలో "రంగా!రంగా " దొరకి ఏదో అర్జెంట్ పనంట కాసేపు వచ్చి ఎల్లమ్మన్నాడు అంటూ వచ్చాడు సీతయ్య .
 "ఈ యాల కాదు రేపు వత్తా అని సెప్పు "
   "అదేంది మావా! అయ్యగారు పిలిత్తే ఎల్లక పోతే బావుండదు. ఏ పని పడిందో ఓ పాలి ఎల్లిరా "
   నిన్ను సూత్తంటే ఎల్ల బుద్ది కావట్లే.ఇన్నాళ్లకు నా రంగి ఊ అంది.ఇంత అందాన్ని వదిలేసి ఎట్టాగా పోయేది ".
  "పో మావా! నాకు సిగ్గేత్తంది.నువ్వు వచ్చేసరికి సొగసంతా దాచి పెడతాలే. "అంటూ కొంటెగా నవ్వింది.
  రంగిని కళ్ళ నిండా నింపుకుని కదిలాడు రంగడు.
  మావ కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. మావ జాడే లేదు.
మెల్లిగా లాంతరు పట్టుకు బయలుదేరింది.
ఇంతలో ఎవరో వెనక నుండి నోరు మూసేశారు. ఎంత పెనుగు లాడినా విడిపించుకోలేక పోయింది.
 ఏటి ఒడ్డుకు లాక్కుపోయారు.ఎంత పెనుగులాడినా రంగి వల్ల కాలా.
బలవంతంగా లొంగదీసుకుని అందాలన్నీ దోచుకుని వదిలేశారు.
  దుఃఖం కట్టలు తెంచుకుంది. మావా!మావా!అంటూ ఏడుస్తూ గోదారి ఒడ్డు అంతా పరుగులు తీసింది.
  ఏదో కాలికి తగిలి బోర్లా పడింది. ఎవరిదో దేహం. కళ్ళు తేరి పారా చూసింది.
  రంగడు సృహ లేకుండా పడుండాడు. ఎంత లేపినా లాభం లేదు. తన మామకి దక్కని నేను, ఎంగిలి పడిన నేను బతక కూడదు అనుకుని గోదారమ్మలో కలిసి పోయింది. కొన ఊపిరితో వున్న రంగడు రంగి తో పాటు గోదారమ్మ ఒడిలో కలిసి పోయాడు.
  బ్రతికి ఒకటి కాలేక పోయిన ప్రేమ పావురాలు చనిపోయి ఒకటయ్యాయి .

కామెంట్‌లు