స్వధర్మాచరణే శ్రేష్టం;- సి.హెచ్.ప్రతాప్
 పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు అని అర్ధం.మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది … అదే  స్వధర్మం అవుతుంది. ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది.గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం. పరమాత్మ నుంచి దూరమైన, విడివడిన మన ఆత్మను పరమాత్మతో చేర్చటమే మన స్వధర్మము, పరమపావనమైన ధర్మము. దానికి తోడ్పడేవే యోగం, ధ్యానం, జ్ఞానం, మౌనం, గానం, నాట్యం. వాటిని సరైన పద్ధతిలో వినియోగించాలి. 

కామెంట్‌లు