సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -409
అబ్భక్ష న్యాయము
****
అబ్భక్షణము అనగా కేవలం నీళ్ళు త్రాగి చేసే ఉపవాసము లేదా నీటి ఉపవాసం.
నీటి ఉపవాసం అంటే కేవలం నీళ్ళు మాత్రమే తాగడం.
ఇలా నీటి ఉపవాసం ఉండే వ్యక్తులు ఏ ఇతర పానీయాలు తాగరు.ఫలహారాలు, అల్పాహారాలు తీసుకోరు.అత్యంత నియమ నిష్ఠలతో ఈ ఉపవాసం చేస్తారు.ఆకలి వేసిన ప్రతిసారీ నీళ్ళతోనే కడుపు నింపుకుంటారు.
కొన్ని  పండుగలు, పబ్బాలు, ప్రత్యేకమైన రోజుల్లో పూర్తిగా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్ళు  తాగుతూ ఉపవాసం  చేస్తారు.
మరి ఈ నీటి ఉపవాసంలో ఉన్న ఉపవాసం యొక్క అర్థమేమిటో? ఎందుకు చేస్తారో ? ఎందుకు చేయాలో?  వివరాల్లోకి వెళదాం.
 ఉపవాసం అంటే ఖచ్చితమైన అర్థం ఏమిటంటే  ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం.మరి ఎవరికీ దగ్గరగా వుండటం అనే ప్రశ్న తలెత్తుతుంది.ఆయా మతాల విశ్వాసాల ప్రకారం వారు నమ్మే భగవంతుడికి దగ్గరగా వుండటం.
మరి దగ్గరగా ఎందుకు వుండాలి? అంటే మానవజాతిలో ఉన్న ఒకానొక నమ్మకం భగవంతునికి దగ్గరగా వుంటే ఆయన సన్నిధిలోనే గడిపితే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఇలా ప్రతి మతంలో ఉన్న భక్తులు ఉపవాసాలు దీక్షలు చేయడం మనందరికీ తెలిసిందే. హిందువులు పండుగల్లోనూ, వివిధ మాసాల్లోనూ ఉపవాసం చేస్తూ ఉంటారు.అలాగే ముస్లింలు రంజాన్ పండుగ మాసంలోనూ, క్రిస్టియన్లు ఈస్టర్ పండుగ సమయంలోనూ... ఇలా ప్రతి మతానికి చెందిన వారు ఏదో ఒక సమయంలో ఉపవాసం చేస్తున్నారు.
ఈ ఉపవాసాల్లో నాలుగు రకాల ఉపవాసాలు వున్నాయి.అందులో  మొదటిది నిర్జలోపవాసం. ఉపవాస సమయంలో నీళ్ళు కూడా తాగరు.అయితే చేయడం ఆరోగ్యరీత్యా మంచిది కాదు.ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది.
ఇక రెండవది అబ్భక్షణము అనగా జలోపవాసం. కేవలం మంచి నీళ్ళు తాగి ఉపవాసం వుండటం. ఇది కూడా ఎవరికీ వారే సొంత నిర్ణయాలు తీసుకుని చేయకూడదు.దీనిని ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు అనారోగ్య రకాలను బట్టి ఇలాంటి ఉపవాసం చేయిస్తుంటారు.
 మూడవ ఉపవాసం రసోపవాసం:- ఈ ఉపవాసం వారం నుండి నెలరోజుల వరకు ఉంటుంది. ఇందులో పండ్ల రసాలతో పాటు నిమ్మరసం,కొబ్బరి నీళ్లు కూడా వుంటాయి.ఇది ముఖ్యంగా  అధిక బరువు తగ్గడానికి చేస్తుంటారు .ఐతే ఇది కూడా వైద్యుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది.
ఇక నాల్గవది ఫలోపవాసం:- ఈ ఉపవాసంలో కేవలం పండ్లను మాత్రమే తినడం వుంటుంది.
 ఇలా వైద్య నిపుణులు కూడా అప్పుడప్పుడు చేసే ఉపవాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెపుతున్నారు.
ఉపవాసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు శాతం,అధిక బరువు తగ్గుతుంది. దేహం చురుగ్గా తయారవుతుంది. శరీరంలో మెరుపు వస్తుంది.
అయితే ఏది చేసినా చేసేంతవరకే చేయాలి.అతి గా చేస్తే ఒంట్లో నీరసం పెరిగి కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి ఏవైనా అవసరం, ఆరోగ్యం మేరకే చేయాలి.
"అబ్భక్ష న్యాయము" ద్వారా మనం ఉపవాసాలు వాటి లాభాలు, నష్టాల గురించి కొంత వరకు తెలుకోగలిగాం.
 భక్తితోనో ఆరోగ్య ప్రయోజనాల కోసమో మనమూ అప్పుడప్పుడు  ఈ నాలుగు ఉపవాసాల్లో  మనం చేయగలిగింది చేద్దాం ."ఆరోగ్యమే మహాభాగ్యము" అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనశ్శరీరాలను ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంచుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు