సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -425
ఉభయ తస్పాశా బద్ధ న్యాయము 
******
ఉభయత అనగా రెండు వైపుల నుండియు, రెండు వైపులను, రెండు సందర్భములలోను.పాశ అనగా త్రాడు,వల,పాచిక.బద్ధ అనగా కట్టబడినది.
రెండు వైపులా తాళ్ళతో బంధింపబడి యున్న వ్యక్తి వలె. ఎటూ తేల్చుకోలేని,మెదలలేని స్థితి.
ఈ న్యాయమును రెండు కోణాల్లో చూడాల్సి వుంటుంది.
పెళ్లి చేసుకున్న వ్యక్తికి తల్లి మరియు భార్య ఇద్దరూ  కలిసి మెలిసి వుంటే ఎలాంటి బాధ, యిబ్బంది ఉండదు కానీ ఎప్పుడైతే వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపుతాయో మధ్యలో ఉన్న ఆ వ్యక్తి యొక్క బాధ వర్ణనాతీతం.
 ఇన్నాళ్ళ నుండి  పెంచి పెద్ద చేసిన దానిని.భార్య వచ్చాక మారిపోయాడు అంటుంది తల్లి.
జీవితాంతం కలిసి బతకాల్సిన దానిని. ఎంత సేపు తల్లి చాటు బిడ్డగా తిరుగుతూ వుంటాడు. నా అభిప్రాయాలకూ ఆలోచనలకు విలువ యివ్వడు " అని భార్య సాధిస్తుంది. అంతే కాదు వారిద్దరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పినప్పుడు ఎవరికి సర్థి చెప్పినా మరొకరికి కోపం.
ఇలా రెండు వైపులా తల్లిబంధం,తాళిబంధం అనే తాళ్ళతో బంధింపబడి ఎటూ తేల్చుకోలేక కొందరు వివాహిత వ్యక్తులు నలిగిపోతుంటారు. అలాంటి వారిని ఈ న్యాయంతో  పోల్చి చెబుతుంటారు.
 ఇక మరో కోణం చూద్దామా....మనిషిలో రెండు రకాల జీవితం వుంటుంది.అదొకటి ప్రవృత్తి పరమైనది.రెండవది నివృత్తి పరమైనది.ఇవి రెండింటి సంగమమే జీవితం.
ప్రవృత్తి అనగా  స్వభావము.ఇది ప్రాపంచిక జీవితానికి సంబంధించినది.ప్రవృత్తి అనేది మనస్సు లోని భిన్నమైన ఆలోచనలను సూచించే వృత్తి.
 నివృత్తిలో 'ని' అంటే లో లేదా లోపల. నివృత్తి అనగా  అంతర్గత ఆలోచన. ఆధ్యాత్మిక ఆకాంక్షగా చెప్పుకోవచ్చు.
ప్రవృత్తిది ఇంద్రియ ఆనంద మార్గం. ఇంద్రియాలకు లోబడి వ్యక్తి ఆలోచిస్తూ,చరిస్తూ వుంటాడు.బహిర్ముఖమైన వివిధ పనులను చేస్తూ వుంటాడు.ఎల్లప్పుడూ లౌకిక వ్యవహారాల్లో తలమునకలై వుంటాడు. ప్రపంచంలో ఒక వ్యక్తిగా వివిధ కార్య నిర్వాహక ధర్మాలను నిర్వర్తిస్తుంటాడు.ఈ ప్రవృత్తి వల్లే ప్రాపంచిక జీవితంలో ముందుకు సాగడానికి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.
కానీ మరో వైపు మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ నివృత్తి వైపు చూపు సారిస్తుంది.ఈ భవ బంధాలు అశాశ్వతమైనవనీ అంతకు మించినది మరొకటి  వుందని నివృత్తి చెబుతుంది.ఏకాంతంలో ఉన్నప్పుడు అంతరంగంలో ఓ మథనం మొదలవుతుంది.
 ఈ రెండూ మనిషి యొక్క అంతరంగాన్ని రెండు వైపులా లాగుతూ పట్టి కుదిపేస్తూ వుంటాయి. 
 ప్రవృత్తికే ప్రాధాన్యత ఇచ్చే ఈ సమాజంలో ఈ రెండింటినీ సమన్వయ పరుచుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. కానీ వాటిని భారంగా భావించకుండా  స్వధర్మం పాటిస్తూ, ఆత్మ సంతృప్తి కలిగించే ఆధ్యాత్మిక జీవనము సాగించేలా చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అప్పుడే "ఉభయ తస్పాశా బద్ధ న్యాయము" భారము కాకుండా  వుంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు